కరోనాపై పోరులో కేంద్రం ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాష్ట్రాలకు సహకరిస్తూ, నిర్ణయాలు తీసుకునే విషయంలో వారిని భాగస్వాములు చేయాలని డిమాండ్ చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు రాహుల్. లాక్డౌన్ అనేది ఆన్-ఆఫ్ స్విచ్ కాదని పేర్కొన్నారు.
" వైరస్‌తో పోరాడుతున్నప్పుడు అధికారాన్ని వికేంద్రీకరించటం అవసరం. కేవలం ఈ పోరాటాన్ని ప్రధాని కార్యాలయానికి పరిమితం చేస్తే ఓడిపోతాం. ప్రధాని తప్పనిసరిగా అధికారాన్ని పంచుకోవాలి. ఒకవేళ అధికారాన్ని ఒకరికే పరిమితం చేస్తే.. విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రులను ప్రధాని నమ్మాలి. జిల్లా పాలనాధికారులను ముఖ్యమంత్రులు నమ్మాలి."
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మే 17 తర్వాత లాక్డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతకు ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారో ప్రజలకు స్పష్టంచేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాహుల్.