భారతీయులు దేశవిదేశాల్లో దాచుకున్న నల్లధనం విలువపై రూపొందించిన మూడు నివేదికలను బహిర్గతం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిరాకరించింది. ఈ నివేదికలను పార్లమెంటరీ సంఘం పరిశీలిస్తున్నందున, వీటిని సమాచారం హక్కు చట్టం ద్వారా వెల్లడించడం కుదరదని తేల్చి చెప్పింది.
ఈ మూడు నివేదికలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వచ్చిన అభ్యర్థనపై ఆర్థిక మంత్రిత్వశాఖ ఈమేరకు స్పందించింది. ఆర్టీఐ సెక్షన్ 8(1)(సీ) ప్రకారం నివేదికలను బయటపెట్టడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.
నల్లధనంపై రూపొందించిన ఈ మూడు నివేదికలు 4 సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి సమర్పించడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ నల్లధనం విలువ ఎంత అనేది అధికారికంగా తెలియరాలేదు.
770 బిలియన్ డాలర్లుగా అంచనా
అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) ప్రకారం నల్లధనం విలువ 2005-2014 మధ్య 770 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అదే సమయంలో భారత్‌లో అక్రమ నగదు 165 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని ఆ సంస్థ తెలిపింది.
యూపీఏ ప్రభుత్వం 2011లో నల్లధనంపై అధ్యయనం చేసే బాధ్యతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ(ఎన్‌ఐపీఈపీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్(ఎన్‌ఐఎఫ్‌ఎమ్)కు అప్పగించింది.
ఈ సంస్థలు తమ నివేదికలను వరుసగా డిసెంబర్ 30, 2013, జూలై 18, 2014, ఆగస్టు 21, 2014లో ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని లోక్‌సభ సెక్రటేరియట్‌కు సమర్పించిన తరువాత స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఫైనాన్స్ పరిశీలనకు పంపారని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.