ప్రభుత్వ అధికారుల నియామకం అనంతరం చేపట్టాల్సిన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సేవల ప్రక్షాళన కోసం ఉద్దేశించిన 'మిషన్ కర్మయోగి'కి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సామర్థ్యం పెంపొందించుకునేందుకు ఇదొక చక్కటి అవకాశమని జావడేకర్ తెలిపారు.
"పౌర సేవల సామర్థ్యం పెంచేందుకు 'మిషన్ కర్మయోగి'ని తీసుకొచ్చాం. పౌర అధికారులు మరింత నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దీనిని ప్రారంభించాం. సాంకేతిక అంశాలపై పట్టు సాధించేందుకు, ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను అందిపుచ్చుకునేందుకు పౌర అధికారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వారి సామర్థ్యం పెంచుకునేందుకు వీలుంటుంది. "
- ప్రకాశ్ జావడేకర్
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల్లో ఇదే అతిపెద్దదని జావడేకర్ తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. దీని కోసం ఐదేళ్ల వ్వవధిలో రూ.510 కోట్ల ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అధికారిక భాషలు..
జమ్ముకశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఉర్దూ, కశ్మీరీ, డోగ్రీ, హిందీ, ఆంగ్లంను అధికారిక భాషలుగా గుర్తించనున్నారు. జమ్ముకశ్మీర్ ప్రజల డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
మరో మూడు అవగాహన ఒప్పందాలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని జావడేకర్ తెలిపారు. వీటిలో నాణ్యత ప్రమాణాల పెంపుపై కేంద్ర జౌళీ శాఖ- జపాన్, గనుల శాఖ- ఫిన్లాండ్, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ- డెన్మార్క్ మధ్య జరిగిన ఒప్పందాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: కరోనా వేళ.. పార్లమెంటు సమావేశాలకు ఏర్పాట్లు ఇలా..