కరోనా రోగులకు సేవలందించిన కేరళాకు చెందిన ఓ నర్సు ఆ వైరస్ బారినే పడింది. ఏ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించిందో అదే ఆస్పత్రిలో రోగిగా చేరాల్సి వచ్చింది. ఎంతో ధైర్యంతో ఆ మహమ్మారిపై విజయం సాధించింది. వైద్యం తీసుకున్న కొద్ది రోజులకే పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న తాను... కరోనా ఐసోలేషన్ వార్డులో తిరిగి సేవలందించేందుకు సిద్ధమంటూ వృత్తిపై ఉన్న మమకారాన్ని, తనలోని ధైర్యాన్ని చాటిచెప్పింది. ఐసోలేషన్‌లో సేవలందిస్తానంటూ తోటి సిబ్బందిలో ధైర్యం నింపింది.
కేరళ కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తోంది రేష్మా మోహందాస్. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన వృద్ధ దంపతులు థామస్ అబ్రహం (93), మరియమ్మ (88) ఉన్న ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తించింది. వారికి అన్ని విధాల సేవలందించింది. వృద్ధులు అసౌకర్యంగా భావించి మాస్కులు ధరించకపోయినప్పటికీ.. వారికి వైద్యం చేసింది. ఇదే క్రమంలో వైరస్ బారిన పడింది.
23న లక్షణాల గుర్తింపు..
మార్చి 23న తొలిసారి రేష్మాలో కరోనా లక్షణాలు కనిపించాయి. గొంతు నొప్పి రావటం వల్ల తోటి సిబ్బందిని అప్రమత్తం చేసింది. మార్చి 24న పాజిటివ్‌గా తేలింది. ఇన్ని రోజులు వృద్ధ దంపతులకు ఎక్కడైతే సేవలు అందించిందో అక్కడే వైద్యం తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిరోజులకే కరోనాను జయించింది. పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. ఈనెల 3వ తేదీన 14 రోజుల హోమ్ క్వారంటైన్ కోసం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లింది రేష్మా. ఈ సందర్భంగా తిరిగి సేవలందించేందుకు తాను సిద్ధమంటూ తన సందేశాన్ని అందించింది.
" ఒక వారం రోజుల్లో నిన్ను (కరోనాను) జయించి ఈ గది నుంచి బయటకి వెళతాను. కేరళ ఆరోగ్య వ్యవస్థపై పూర్తి నమ్మకంతోనే ఈ సందేశాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. ఇక్కడ ప్రపంచ స్థాయి సేవలు ఉన్నాయి. నేను తిరిగి వచ్చాక ఐసోలేషన్ వార్డులో పనిచేసేందుకు సిద్ధం " అంటూ తన సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది రేష్మా.
కరోనాను జయించిన దంపతులు
సాధారణంగా కరోనా బారిన పడిన వృద్ధులు ఆ వ్యాధి నుంచి బయటపడటం చాలా అరుదు. రేష్మా సేవలు అందించిన వృద్ధ దంపతులు ఇద్దరూ ఆ మహమ్మారిని జయించారు. వారు కరోనా నుంచి కోలుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది నర్సు.
ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంస..
కరోనా నుంచి కోలుకున్న నర్సు రేష్మాకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ఫోన్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రేష్మా వృత్తి నిబద్ధతను కొనియాడారు. వృద్ధ దంపతులకు సొంత తల్లిదండ్రుల్లా సేవలందించిందని ప్రశంసించారు.
ఇదీ చూడండి: చేతులు పదేపదే కడిగినా ఇబ్బందే- ఈ జాగ్రత్తలు తప్పనిసరి