బిహార్ ఎన్నికల సమరంలో తొలిదఫా పోలింగ్ పూర్తయింది. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 243 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. తొలిదశలో దాదాపు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
వివిధ సమయాల్లో..
మొత్తం 71 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. 4 చోట్ల పోలింగ్ 3 గంటలకే ముగియగా.. 27 చోట్ల పోలింగ్ 4 గంటల వరకు, 5 స్థానాల్లో 5 గంటల వరకు, 35 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతిచ్చారు అధికారులు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే పోలింగ్ సమయం తగ్గించారు.
ప్రముఖులు ఇక్కడ..
కేంద్రమంత్రి, సీనియర్ భాజపా నాయకుడు గిరిరాజ్ సింగ్ తన ఓటును లఖిసరాయ్‌లో వినియోగించుకున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి,హామ్ పార్టీ అధ్యక్షుడు జతిన్ రామ్ మాంఘీ గయలో ఓటు వేశారు.
రాష్ట్ర మంత్రులు విజయ్ సిన్హా(లఖిసరాయ్), క్రిష్ణానందన్ వర్మ(జెహనాబాద్), ప్రేమ్ కుమార్(గయా టౌన్), రామ్ నారాయణ్ మండల్(బంక), జైకుమార్ సింగ్(దినారా), సంతోష్ కుమార్ నిరల(రాజ్‌పుర్) సహా కామన్వెల్త్ స్వర్ణపతక విజేత శ్రేయసి సింగ్(జముయ్) నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.