చట్టానికి కళ్లు ఉండవేమో.. కానీ, న్యాయమూర్తులకు మనసు ఉంటుంది. అందుకే, తల్లి ఆకలి తీర్చేందుకు దొంగగా మారిన ఓ బాలుడిని శిక్షించకుండా సాయం చేశారు బిహార్‌కు చెందిన ఓ జడ్జి.
నలందలో దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ మైనర్. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ముందు తప్పు ఒప్పుకున్నాడు బాలుడు. ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకున్నాడు.
"నేను దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు నన్ను పోలీసులు పట్టుకున్నారు. స్థానికులు గుమిగూడి నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత నన్ను జైలుకు తీసుకెళ్లారు. కోర్టులో నన్ను హాజరుపరిచినప్పుడు జడ్జి నా బాధ అర్థం చేసుకున్నారు. నేను ఎందుకు దొంగతనానికి తెగబడ్డానో తెలుసుకున్నారు. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. మాకు తినడానికి తిండి లేదు. ఆమె ఆకలి తీర్చేందుకే నేను ఈ పని చేశాను. "
-బాధిత బాలుడు
బాలుడి దీన పరిస్థితి చూసి చలించిపోయారు స్థానిక కోర్టు జడ్జి. అందుకే శిక్షించకుండా కరుణించారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప... ఉండేందుకు ఇల్లు కూడా లేని ఆ కుటుంబానికి రేషన్, బట్టలు అందించి ఆదుకున్నారు. గత్యంతరం లేక తప్పు చేసిన కొడుకును జైలుకు పంపకుండా ఆ తల్లి ముఖాన చిరునవ్వులు కురిపించారు.
కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఆ బాలుడు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందన్నారు.
ఇదీ చదవండి:ఈ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికం: హోంశాఖ