ETV Bharat / bharat

ప్రజాస్వామ్య భారతాన్ని కాపాడుకోలేమా? - ప్రజాస్వామ్యం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్​ ఒకటి. బ్రిటిష్​వారి నుంచి స్వతంత్రం వచ్చిన నాటి పరిస్థితులకు అనుగుణంగా... తమ ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలని అప్పటి నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తంతును రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఏడుదశకాల స్వతంత్ర భారత్​లో ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పులు ఏ విధంగా ఉన్నాయి. ప్రత్యేక కథనం మీ కోసం.

Analysis story on Indian democratic
ప్రజాస్వామ్య భారతాన్ని కాపాడుకోలేమా?
author img

By

Published : Mar 4, 2020, 8:19 AM IST

ఎన్నికల ప్రక్రియను ధనశక్తి సాంతం భ్రష్టు పట్టించకముందే, అసాంఘిక శక్తుల చేతుల్లో అది పనిముట్టుగా మారిపోకముందే సరైన సంస్కరణలకు సమకట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధిపతిగా టీఎన్‌ శేషన్‌ హెచ్చరించి ఇరవై ఏడేళ్లు గతించాయి. ఆ మంచిమాటకు మన్నన కొరవడబట్టే- అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం కంటే పాతికశాతం అధికంగా దాదాపు రూ.60వేలకోట్ల ఖర్చుతో నిరుటి సార్వత్రిక ఎన్నికలు ధనశక్తి విశ్వరూపాన్ని కళ్లకు కట్టాయి. 90 కోట్ల పైచిలుకు ఓటర్ల పరంగానే కాదు, ఖర్చురీత్యానూ భారతావని ఎన్నికలకు సరిసాటి పోటీ ప్రపంచంలో లేదని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అధ్యయనం నిరుడు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 80 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు వందకోట్ల రూపాయలకు పైగా వెదజల్లారంటే ఏమనుకోవాలి?

ఎన్నికల వ్యయాన్ని కేంద్రమే భరించాలి!

ఎన్నికల్లో ఈ తరహా ధన ప్రభావ నియంత్రణే లక్ష్యంగా ఏనాడో 1998లో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ- అభ్యర్థుల ఎలక్షన్‌ ఖర్చులు కొన్నింటిని ప్రభుత్వమే భరించేలా విస్పష్ట సూచనలు చేసింది. ఎన్నికల్లో నల్లధన ప్రవాహాలకు, గెలుపు గుర్రాలుగా నేరగాళ్ల ఉరవళ్లకు, అధికారం దక్కాక అవినీతి పరవళ్లకు ఎంత దగ్గర సంబంధం ఉందో ఇటీవలి చరిత్రే చాటుతోంది. ఈ పీడ విరగడ కావాలన్న ఆలోచన ఎగదన్నినప్పుడల్లా- ప్రభుత్వమే ఎన్నికల వ్యయాన్ని భరించాలన్న అంశం పైకి తేలుతోంది. కేంద్రమే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని భరించే ప్రతిపాదన తనకు సమ్మతం కాదని ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పిందంటూ, ప్రభుత్వం సమకూర్చినదాన్ని మించి జరిగే ఖర్చుల నిషేధం లేదా నియంత్రణలు తన వల్ల కాదన్నది ఈసీ మనోగతమని మోదీ ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు నివేదించింది. ముందుగా నేరమయ రాజకీయ వ్యవస్థను నిర్మూలించకుండా, పార్టీల నిర్వహణలో పారదర్శకత పెంచకుండా, నిధుల ప్రవాహాల సక్రమ తనిఖీకి తగు చట్టబద్ధ యంత్రాంగాల్ని నెలకొల్పకుండా- ప్రభుత్వమే పార్టీలకు ఎన్నికల నిధులు అందిస్తే అరాచకం మరింత పెరుగుతుందని నిర్వాచన్‌ సదన్‌ సారథిగా నసీం జైదీ 2015లో నిష్ఠుర సత్యం పలికారు. ఎన్నికల అవ్యవస్థ సాకల్య క్షాళనే లక్ష్యంగా సర్వసమగ్ర సంస్కరణలపై జాతీయ స్థాయిలో మేధామథనం సాగాలిప్పుడు!

నల్లధనమే ఇంధనం!

ఏడు దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్యానికి నల్లధనమే ఇంధనంగా మారిందని, ఆ దుర్వినీతిని అరికట్టడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, పార్టీలు, పార్లమెంటుతో పాటు ఎన్నికల సంఘమూ విఫలమైందని 2017 జులైలో విత్తమంత్రిగా అరుణ్‌జైట్లీ అంగీకరించారు. నల్లధన ప్రభావాన్ని నులిమేసే సంస్కరణగా ఆయనే తెచ్చిన ఎలక్టోరల్‌ బాండ్లు- పారదర్శకత జవాబుదారీతనాలకు చెల్లుకొట్టి వ్యవస్థకు మరింత చెరుపు చేస్తున్నాయని చెప్పకతప్పదు. 90శాతం ఆర్థిక వనరులు ఒక్క పార్టీ చెంతే పోగుపడుతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయాన్ని సర్కారే భరించాలన్న మాట మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నోట నిరుడు జులైలో వెలువడింది.

నివేదికల దుమ్ము దులపాలి!

ధన భుజ అధికారబలం వంటి దశ మహాపాతకాల ముష్టిఘాతాలతో దశాబ్దాలుగా కృశించిన ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. దాన్ని తెప్పరిల్లజేసి జవసత్వాలు కూర్చాలంటే దినేశ్‌ గోస్వామి కమిటీ నుంచి రెండో పరిపాలన సంస్కరణల సంఘం దాకా ఎన్నో కమిటీలు సమర్పించిన ఎన్నెన్నో నివేదికల దుమ్ము దులపాలి. 2013లో సమగ్ర ఎన్నికల సంస్కరణలపై న్యాయసంఘం ఎనిమిది కీలకాంశాలపై సంప్రతింపుల పత్రాన్ని రూపొందించి చట్టసభలు, న్యాయవాద సంఘాలు, జాతీయస్థాయి వ్యవస్థలు-సంఘాలు, పౌర సంస్థలు, న్యాయకోవిదులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు... ఇలా భిన్న రంగాల వారికి పంపిస్తే- వచ్చిన ప్రతిస్పందనలు కేవలం నూట యాభై ఏడు! ఎక్కడికక్కడ ఊడలు దిగిన రాజకీయ అవినీతి మర్రి, దేశప్రయోజనాల్ని జుర్రేస్తున్నా- ఆత్మహత్యాసదృశమైన ఉదాసీనత ఇంకానా?

నోటుకే ఓటు!

ఇండియాలో ఉన్నది సార్వత్రిక వయోజన ఓటింగ్‌ పద్ధతి అయినందువల్ల పార్లమెంటుకు ఎన్నికయ్యే ప్రతినిధులదే కాదు; ఓటర్ల నిజాయతీనీ పదిలంగా కాపాడుకోవాలని జస్టిస్‌ చాగ్లా ఆరున్నర దశాబ్దాల నాడు సూచించారు. ‘ఓటు వెయ్యి’ అని పౌరుల్ని అభ్యర్థించాల్సిన పార్టీలు- ‘ఓటుకు వెయ్యి’ అని మొదలుపెట్టి, ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే లక్ష్యంగా పోలింగుకు ముందునాడు సాగిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ వేలకోట్ల రూపాయలకు చేరిందిప్పుడు! నిరుటి సార్వత్రికంలో పార్టీలు ప్రచారం కోసం వెచ్చించిన మొత్తమే దాదాపు రూ.25వేల కోట్లు అంటున్నారు! ‘ఎన్నికలంటే వివిధ అంశాలపై ప్రజల అవగాహన స్థాయిని పెంచే సందర్భం’ అన్న అడ్వాణీ మాటలకు, నడుస్తున్న చరిత్రకూ అసలు పొంతన, పోలిక ఉన్నాయా? కొత్త సహస్రాబ్దిలో డిజిటల్‌ సాంకేతికత- ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల వంటి మోటు ప్రచారాలకు చెల్లుకొట్టేలా నయా వేదికల్ని సృష్టించినా సారా ప్యాకెట్ల అనాగరిక పోకడల్ని వీడలేమా?

జాతీయ స్థాయిలో చర్చ..!

అయిదువేలు ఇచ్చిన వ్యక్తికి ఓటేస్తే అయిదేళ్ల దోపిడీని మౌనంగా భరించాల్సివస్తున్న దురవస్థపై జాగృత జనచేతన రాజ్యాంగ వ్యవస్థల బాధ్యత కాదా? పార్టీలకు నిధులు ఎలా వచ్చాయన్నది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వమే సుప్రీంకోర్టులో వాదించింది. ఆ తరహా పెడసరాన్ని పార్టీలు సడలించి ‘ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు’గా భారత ప్రజాస్వామ్యానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసేలా- జాతీయ స్థాయిలో చర్చ మొదలుకావాలి. తొంభయ్యో దశకంలో లార్డ్‌ నోలన్‌ కమిటీ సూచనలు బ్రిటన్‌ రాజకీయాల్ని ప్రక్షాళించినట్లుగా- ఇక్కడి పార్టీలకు బాధ్యత జవాబుదారీతనాల్ని మప్పి వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా తీర్చిదిద్దే మహాయజ్ఞం ఎంత త్వరగా మొదలైతే దేశం అంత తొందరగా తెరిపిన పడుతుంది!

ఇదీ చూడండి: తాలిబన్​ ఒప్పందం.. భారత్​ భద్రతకు చేటు తెచ్చేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.