కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో విమాన పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ముక్కలైన విమానం
వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన డీఎక్స్‌బీ-సీసీజే బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానం రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం పక్కనే ఉన్న 30 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. దీంతో విమానం రెండు ముక్కలైంది.
ప్రమాదం జరిగిన విమానంలో 184 మంది(10 మంది చిన్నారులు) ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి 7.41 గంటలకు ప్రమాదం జరిగిందని, ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగలేదని స్పష్టం చేసింది.
రన్‌వేపై ల్యాండ్ అయిన తర్వాత విమానం ముందుకు దూసుకెళ్లి లోయలో పడిపోయిందని డీజీసీఏ వెల్లడించింది.
రెండున్నర గంటల్లో సహాయక చర్యలు పూర్తి
ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే విమానంలో చిక్కుకున్నవారందరినీ బయటకు తీశారు.
క్షతగాత్రుల్లో 110 మందిని కోజికోడ్‌లోని ఏడు ఆస్పత్రులకు తరలించినట్లు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో 11 మంది మరణించినట్లు చెప్పారు. మిగిలిన 80 మందిని మలప్పురంలోని ఆస్పత్రులకు తరలించగా.. అందులో ఆరుగురు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.
కారణమేంటి?
భారీ వర్షాల కారణంగానే విమానం అదుపుతప్పినట్లు తెలుస్తోంది. రన్‌వేపైకి నీరు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. విమాన ప్రమాదంపై డీజీసీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.
మరోవైపు ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ(ఏఏఐబీ)చే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు దర్యాప్తు బృందాలను కోజికోడ్‌కు పంపించినట్లు తెలిపారు.
సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రయత్నించినా...
విమానం ల్యాండింగ్ చేసేందుకు ఎయిరిండియా పైలట్లు రెండు సార్లు ప్రయత్నించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. భీకరమైన ఎదురుగాలుల వల్ల రెండుసార్లు ల్యాండింగ్ ప్రయత్నాన్ని మానుకున్నట్లు వెల్లడించారు. చివరి ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు.
విమానం రన్‌వే పై దిగడానికి ముందు రెండు సార్లు ఎయిర్‌పోర్టు చుట్టూ తిరిగి వచ్చిందని ప్రయాణికుల్లో ఒకరైన రియాస్ వెల్లడించారు.
"నేను వెనక సీట్లో కూర్చున్నాను. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు."
-రియాస్, ప్రయాణికుడు
విమానం బలంగా రన్‌వేపై దిగిందని మరో ప్రయాణికురాలు ఫాతిమా తెలిపారు. ఆ తర్వాత ముందుకు దూసుకెళ్లినట్లు చెప్పారు.
మోదీ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు..ఈ విషాదకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం పినరయి విజయన్‌తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.
ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ సైతం విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
రాహుల్
విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీ సహా ఇతర నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.