వివాదాలకు దారితీసిన వ్యవసాయ బిల్లులను కేంద్రం ప్రభుత్వం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదం లాంఛనంగానే కనిపిస్తున్నప్పటికీ.. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూలంగా బిల్లులను ప్రతిపాదించారని ఆరోపిస్తున్నాయి.బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఐక్య కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాయి.
భాజపా నేతల ధీమా..
మరోవైపు బిల్లుల ఆమోదం కోసం చాలా ప్రాంతీయ పార్టీల మద్దతుకు భాజపా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. బిల్లుల ఆమోదంపై భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా 130 మంది సభ్యుల మద్దతు భాజపాకు ఉంది.
కొంతకాలంగా కేంద్రం ప్రతిపాదించిన వివిధ చట్టాలకు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. అయితే, తెరాస మాత్రం ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు తెరాస ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ.. బిల్లులపై భాజపా మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాజకీయ దుమారం..
వ్యవసాయ రంగ సంస్కరణల్లో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన మూడు చట్టాలపై భాజపా, విపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా భాజపా మిత్రపక్షం అకాలీదళ్.. ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర మంత్రి పదవికి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు.
అయితే, బిల్లులపై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా నేతలు మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.
ఇదీ చూడండి: వ్యవసాయ అనుబంధ బిల్లులపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు