దేశమంతటా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు రోడ్లపై తిరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై ప్రయాణించే వారిని మందలిస్తున్నారు. అయితే కోల్కతాలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసుకు వింత అనుభవం ఎదురైంది. లాక్డౌన్ను ఉల్లంఘించి ప్రయాణిస్తున్న ఓ కారును అడ్డుకోగా... కారులో ఉన్న మహిళ వీరంగం సృష్టించింది. నడిరోడ్డుపై అధికారి యూనిఫాంను తన నాలుకతో నాకింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.
తీవ్ర వాగ్వాదం తర్వాత...
కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని పీఎన్బీ క్రాసింగ్ వద్ద అధికారి... నిబంధనలు ఉల్లంఘించిన కారు ఆపి అందులోని డ్రైవర్ను మందలించాడు. కారులో ఉన్న ఓ మహిళ బయటకు వచ్చి అసభ్య పదజాలంతో పోలీసును దూషించింది. తాను అనారోగ్యంతో ఉన్నానని, మందులు కొనుక్కోవడానికి బయటకు వెళ్తున్నానని వాదించింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అంతలో ఆమె ఒక్కసారిగా అధికారి మీదకు దూసుకువచ్చి అతడి యూనిఫాంను తన నాలుకతో నాకగా... యూనిఫాంపై రక్తపు మరక ఏర్పడింది. తాను అనారోగ్యంతో ఉన్నాను అనడానికి ఇదే రుజువని చెప్పింది.
అక్కడే ఉన్న పోలీసులు ఆమెను శాంతింపచేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమెను, కారులో ఉన్న మరో వ్యక్తిని, డ్రైవర్ను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి : ఎయిడ్స్ మందులతో కోలుకున్న కరోనా బాధితుడు