బాణామతి.. అనుమానించే వారికి అభద్రతా భావం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నిత్య నరకం. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాపుర్లో ఇది నిరూపితమైంది. క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆరుగురు వ్యక్తుల పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు గ్రామస్థులు.
గోపాపుర్కు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుకోకుండా మరణించారు. పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఘటనలకు కారణమేమిటంటూ గ్రామస్థులు బూత వైద్యులను సంప్రదించారు. ఈ మరణాలు, అనారోగ్యాల వెనుక నహక్ కుటుంబమే ఉందని చెప్పారు బూత వైద్యులు.
నహక్ కుటుంబానికి చెందిన జోగిదాస్, రమా నహక్, హరి, సానియా, జోగేంద్ర, జూరియా నహక్ను ఓ గదిలో బంధించారు గ్రామస్థులు. ముగ్గురిని చంపింది మీరేనని ఆరోపిస్తూ అమానవీయంగా దాడి చేశారు. బలవంతంగా మానవ వ్యర్థాల్ని తినిపించారు. పళ్లు విరగగొట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గంజాం ఎస్పీ బ్రిజేశ్ రే, ఖలీకోట్ తహసీల్దార్ చిత్తరంజన్ మెహంతా... బాధితులను గ్రామస్థుల చెర నుంచి రక్షించేందుకు వెళ్లారు. ఆగ్రహించిన స్థానికులు అధికారులపై కారప్పొడి, రాళ్లతో దాడి చేశారు. ఎట్టకేలకు బాధితులను రక్షించారు పోలీసులు. 29 మందిని అరెస్టు చేశారు. గ్రామంలో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇదీ చూడండి: లలితా జ్యువెలరీలో దొంగతనం చేసింది వీళ్లేనా...!