కరోనా, భారత్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులతో పాటు విలేకరులు, పోలీసులు ప్రమాదంలో పడుతున్నారు. ముంబయిలో ప్రాణాలకు తెగించి కొవిడ్-19 వివరాలు సేకరిస్తోన్న 53 మంది జర్నలిస్టులు కరోనా మహమ్మారికి చిక్కారు. అహ్మదాబాద్‌లో విధులు నిర్వహిస్తోన్న 24 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు.
మీడియాపై మహమ్మారి..
క్షేత్ర స్థాయి వార్తలు సేకరించే జర్నలిస్టులు తప్పని పరిస్థితుల్లో జన సమూహాల్లోకి వెళ్తున్నారు. ముంబయిలో 53 మంది విలేకరులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులే అధికంగా ఉన్నారని స్పష్టం చేశారు.. టీవీ జర్నలిస్ట్ అసోయేషన్(టీవీజేఏ) అధ్యక్షుడు వినోద్ జగదళే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.
వైరస్ బాధితులను కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ). ఇప్పటికే కరోనా లక్షణాలు కనిపించిన మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్విహించి గృహ నిర్బంధానికి పంపించారు అధికారులు. అయితే, వారి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది.
మీడియా ప్రతినిధులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీఎంసీని ఆదేశించారు. దీంతో, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది పర్యవేక్షణలో 171 మంది మీడియా ప్రతినిధులకు... ఈ నెల 16-17న ముంబయి ప్రెస్ క్లబ్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. జనసమూహంలో తిరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు.
పోలీసులనూ వదల్లేదు..
ఇక గుజరాత్ అహ్మదాబాద్‌లో 24 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. మరో 200 మంది గృహ నిర్బంధంలో ఉన్నారని తెలిపారు డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్.
మొదట అహ్మదాబాద్ ఖాడియాకు చెందిన ఓ ఇన్స్పెక్టర్కు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ స్టేషన్‌లోని 15 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. అదే ప్రాంతంలో ఓ ఎమ్మెల్యే సహా పలువురికి కరోనా సోకినట్లు నిర్ధరణయింది. ఓ అస్టింటెంట్ పోలీస్ కమిషనర్, 9 మంది ట్రాఫిక్ పోలీసులు సహా మరో 14 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి:కరోనాతో ఆందోళన వద్దు.. వాటిని అతిగా కొనొద్దు