ఐదంటే ఐదేళ్లు.. ఈ వయసులో ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు పిల్లలు. కానీ, తమిళనాడుకు చెందిన సంజన మాత్రం విలువిద్యలో సత్తా చాటుతోంది. కేవలం 13 నిమిషాల్లో 111 సార్లు అవలీలగా లక్ష్యాన్ని చేధించింది. ఈ బాణాలన్నీ తలకిందులుగా వేలాడుతూ, నిర్విరామంగా వేయడం విశేషం.
మూడేళ్లకే...
చెన్నైకు చెందిన ప్రేమ్‌నాథ్, శ్వేతల గారాలపట్టి సంజన. ప్రేమ్ నాథ్ ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగి. శ్వేత గృహిణి. పుట్టుకతోనే ప్రతిభను వెంటబెట్టుకొచ్చిన కూతురికి ఊహ తెలిసినప్పటి నుంచే ఆర్చరీ శిక్షణ ఇప్పించాడు ప్రేమ్.
సాధారణంగా విలు విద్య నేర్చుకున్నవారు 20 నిమిషాల్లో సుమారు 30 వరకు బాణాలు వేయగలరు. కానీ, సంజన మాత్రం కనివినీ ఎరుగని రీతిలో, తలకిందులుగా వేలాడుతూ 111 బాణాలు ఎక్కుపెట్టి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు గురి పెట్టింది.
ప్రపంచం నివ్వెరపోయేలా...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన కార్యక్రమం సంజన ప్రతిభా ప్రదర్శనకు వేదికైంది. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సెక్రెటరీ జనరల్ ప్రమోద్ చందుర్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఏఐ జడ్జీల కమిటీ ఛైర్మన్ డాక్టర్ జోరిస్, అంతర్జాతీయ ఆర్చరీ జడ్జ్ సీఎస్ మనియణ్ సంజన విన్యాసాల్ని ఆన్లైన్లో వీక్షించారు. చిన్నారి ప్రతిభను చూసి ఔరా అనుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించాల్సిందిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేశారు.
ఇలాంటి రికార్డులు సృష్టించడం సంజనకు కొత్తేమీ కాదు. మూడేళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టించింది ఆమె. 2018లో ఎనిమిది మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని.. కేవలం మూడున్నర గంటల్లో 1,111 సార్లు ఛేదించి.. "హ్యూమన్ అల్టిమేట్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకుంది.
ఐదేళ్లకే విలువిద్యలో చేయి తిరిగిన కూతురిని ఒలింపిక్స్ కు పంపాలన్నది ప్రేమ్‌నాథ్ కల. అందుకే, 2032 విశ్వ క్రీడల్లో ఎలాగైనా పాల్గొనే విధంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతవరకు సంజనతో ఏటా ఓ కొత్త రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నారు ప్రేమ్‌నాథ్.
ఇదీ చదవండి: ఆమె మైనపు విగ్రహం సృష్టికర్త ఈయనే...