కేరళ కాసర్గోడ్లోని ఓ ఆస్పత్రి కరోనా వార్డులో పట్టుకున్న ఐదు పిల్లులు చనిపోయాయి. ఈ మూగజీవాలు కొవిడ్-19 వైరస్ బారిన పడి మరణించినట్లు అనుమానిస్తున్న వైద్యులు... నిర్ధరణ కోసం వాటి అవయవాలను తిరువనంతపురంలోని కరోనా పరీక్షల కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు.
ఒత్తిడితోనే... మృతి?
"పిల్లులకు చేసిన ప్రాథమిక పోస్టుమార్టంలో 'కరోనా వైరస్' సోకినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు."
- ఎమ్.జె.సేతులక్ష్మి, ఎపిడిమోలజిస్టు
కరోనా వార్డులో విచ్చలవిడిగా తిరుగుతున్న పిల్లులను... రోగుల ఫిర్యాదుల మేరకు మార్చి 28న అధికారులు పట్టుకుని బోనుల్లో ఉంచారు. ఆసుపత్రి సిబ్బంది వాటికి ఆహారం, పాలు అందించారు. అయితే వాటిని సరిగ్గా గాలి కూడా రాని చిన్న చిన్న బోనుల్లో ఉంచడం వల్ల ఒత్తిడితోనే చనిపోయి ఉండొచ్చని కొంతమంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిజ నిర్ధరణ కోసం
అనుమానాస్పద స్థితిలో మరణించిన మూగజీవాల్లో.... రెండు మగ పిల్లులు, ఓ ఆడ పిల్లి, దాని కూనలు రెండు ఉన్నాయి. వీటి అవయవాలను తిరువనంతపురంలోని 'స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ సెంటర్'లో వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం పంపాలని పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయించారు.
అవసరమైతే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి ఈ పిల్లుల అవయవాలను పంపిస్తామని జంతు వ్యాధుల నియంత్రణ ప్రాజెక్టు జిల్లా సమన్వయకర్త డాక్టర్ టిటో జోసెఫ్ తెలిపారు.
జంతు సంరక్షణ కోసం
అమెరికాలోని ఓ పులికి కరోనా సోకిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జంతు ప్రదర్శనశాలల్లోని మూగజీవాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి: భవితను మనమే నిర్మించుకుందాం!