బిహార్ బోధ్ గయాలోని ఓ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు వైద్యులు. దీంతో ఇంటిల్లిపాదిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
వద్దన్నా వినకుండా...
కరోనా కాలంలో సమూహాలుగా తిరగొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు గొంతుచించుకుంటున్నా.. బోధ్ గయాకు చెందిన ఆ కుటుంబంలోని ఓ నవజాత శిశువు తలనీలాలు సమర్పించేందుకు ఝార్ఖండ్‌కు వెళ్లారు. ఆ కార్యక్రమంలో మరెందరో బంధువులు పాల్గొన్నారు. తిరిగి ఇళ్లకు చేరుకున్నాక, కొందరికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులందరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 30 మంది నమూనాల్లో 25 మందికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా ఉందని తెలిసేసరికి.. గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టారు. బోధ్ గయాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇప్పటికే జిల్లాలో 300 మందికి వైరస్ సోకిందని అన్నారు అధికారులు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం బిహార్ వ్యాప్తంగా ఇప్పటివరకు 14,575 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 10,109 మంది కోలుకోగా.. 119 మంది మహమ్మారి ధాటికి మృతి చెందారు.
ఇదీ చదవండి: ఇక ఒకే పీపీఈ కిట్‌ను మళ్లీమళ్లీ వాడొచ్చు!