Beef Tribals Kerala: గోడ్డు మాంసం తిన్న కారణంగా 24 మంది గిరిజనులను సమాజం నుంచి బహిష్కరణ చేశారు పెద్దలు. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా అడవిలో బతకాలంటూ వారు ఇచ్చిన తీర్పు స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కీలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..
మరాయూర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల్లో కొందరు బీఫ్‌ను తిన్నారు. ఇది వారి సంప్రదాయానికి విరుద్ధం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన పెద్దలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 మందిని సమాజం నుంచి బహిష్కరించారు. వారు అడవిలోనే బతకాలని.. వారిని కలిసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి కూడా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరించారు. కొన్ని వందల ఏళ్లగా వస్తున్న సంప్రదాయానికి నిందితులు భంగం కలిగించినట్టు ఊరుకూట్టమ్లుగా పిలిచే గిరిజన పెద్దలు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బహిష్కరణకు గురైన వారిని సంప్రదించేందుకు కూడా అవకాశం లేదని అంటున్నారు పోలీసులు. గిరిజన పెద్దల ఆదేశాల మేరకు అడవిలో చాలా దూరం వెళ్లిపోవడమే అందుకు కారణమన్నారు.
ఈ ఘటనపై స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కే రాధాకృష్ణన్.. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: Jayalalitha House: మేనకోడలి చేతికి జయలలిత నివాసం