Bangladesh PM Visit To India : భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో ఇరు దేశాల ప్రధానులు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. షేక్‌హసీనా.. నరేంద్ర మోదీ సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఏడు ఎంఓయూలపై సంతకాలు చేశారు. భారత్, బంగ్లాదేశ్ స్నేహం పరస్పర సహకార స్ఫూర్తితో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. తీస్తా నీటి పంపిణీ సహా అన్ని సమస్యలకు త్వరలో ముగింపు పలకాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు.. ఇరు దేశాల విశ్వాసంపై దాడి చేయాలనుకునే శక్తులను కలిసి ఎదుర్కోవడం చాలా అవసరమని మోదీ అన్నారు.
''రానున్న 25 ఏళ్ల అమృత కాలంలో భారత్, బంగ్లాదేశ్ మైత్రి బంధం సరికొత్త శిఖరాలకు చేరుతుందన్న నమ్మకం నాకుంది. బంగ్లాదేశ్.. భారత్‌కు అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి. ఈ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సహకారంలోనూ నిరంతర అభివృద్ధి ఉంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా వృద్ధి చెందుతోంది. ఐటీ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సహకారం అందించాలని నిర్ణయించాం. విద్యుత్ ప్రసార మార్గాలపై కూడా భారత్, బంగ్లాదేశ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్-బంగ్లా గుండా 54 నదులు ప్రవహిస్తున్నాయి. కుషియారా నది నీటి భాగస్వామ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాం.''
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదని.. భారత్‌తో తమది అలాంటి మైత్రేనని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్, బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. "భారత్ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాము" అని పేర్కొన్నారు.
"రాబోయే 25 ఏళ్లలో అమృత్ కాలపు కొత్త ఉషస్సులో ఆత్మనిర్భర్ భారత నిర్మాణం కోసం చేసిన తీర్మానాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్న భారత్‌కు శుభాకాంక్షలు. ప్రధాని మోదీతో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. ఈ చర్చల ఫలితం.. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనాలను తీసుకొస్తుంది. దృఢమైన స్నేహం.. సహకార స్ఫూర్తితో ఈ భేటీ జరిగింది. భారత్-బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. బంగ్లాదేశ్‌కు భారత్‌అత్యంత ముఖ్యమైన, సన్నిహిత పొరుగు దేశం. భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు దౌత్య సంబంధాలకు రోల్ మోడల్‌గా ప్రసిద్ధి చెందాయి."
షేక్‌హసీనా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
భారత్ బంగ్లా ప్రధానుల భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలతో.. ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్‌తో భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాని గురువారం రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌కు వెళ్లి మొయినుద్దీన్ చిస్తీ దర్గాను దర్శించే అవకాశం ఉంది. హసీనా చివరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు.
ఇవీ చదవండి: 'భారత్‌తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా'
దిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఈడీ నజర్.. హైదరాబాద్ సహా 30 ప్రాంతాల్లో సోదాలు