వారసుల్లేకుండా రాజు చనిపోతే ఆ రాజ్యం తమ వశం అనేది అప్పట్లో ఈస్టిండియా కంపెనీ భారత్‌లో అమలుచేసిన చట్టం! దాని ప్రకారం వారసుల్లేని నాగ్‌పుర్ రాజు చనిపోవటం వల్ల మహారాష్ట్రలోని చాందా జిల్లా (ప్రస్తుత చంద్రపుర్, గడ్చిరోలి జిల్లాలు) 1854లో ఆంగ్లేయుల పరమైంది. అప్పటికే తరతరాలుగా ఈ ప్రాంతం గోండుల చేతుల్లో ఉంది. వారి కుటుంబాలే జమీందార్లుగా వ్యవహరించేవి. ఆంగ్లేయ సర్కారు రాకను వీరంతా నిరసించారు. అడవులపై ఆంగ్లేయుల పెత్తనాన్ని ప్రశ్నించారు. అలాంటి జమీందారీల్లో ఒకటి మోలంపల్లి. 25 ఏళ్లకే మోలంపల్లి జమీందారుగా బాధ్యతలు చేపట్టిన బాబూరావు శెడ్‌మాకె తన ప్రజలను కాపాడటంతో పాటు బ్రిటిష్ వారిపై పోరాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. 500 మంది ఆదివాసీ యువకులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని.. చాందా జిల్లాలోని రాజ్‌గఢ్ పరగణాను స్వాధీనం చేసుకున్నాడు. విషయం తెలిసిన చాందా కలెక్టర్ క్రిస్టన్ ఆంగ్లేయ సైన్యాన్ని పంపించాడు. 1858 మార్చి 13న నంద్‌గావ్-గోసరి గ్రామాల దగ్గర శెడ్‌మాకె, ఆంగ్లేయ సైన్యాలు తలపడ్డాయి.
ఆదివాసీలేగదా అనుకుని బరిలోకి దిగిన ఆంగ్లేయులు దారుణంగా ఓడిపోయారు. కొంతమంది ప్రాణాలతో పారిపోయారు. ఆయుధాలన్నీ బాబూరావు సైన్యం వశమయ్యాయి. ఈ విజయం సంగతి తెలియగానే.. ఆడ్‌పల్లి, ఘోట్ ప్రాంతాల జమీందార్లూ ఆయనతో కలిశారు. ఆంగ్లేయులపై తిరుగుబాటు ప్రకటించారు. గడిసుర్లా కోటపై పాగా వేశారు. క్రిస్టన్ మళ్లీ ఓ దళాన్ని పంపించగా.. ఈసారీ ఎదురుదెబ్బే తగిలింది. దీంతో లెఫ్టినెంట్ జాన్ నాటల్ సారథ్యంలో భారీఎత్తున నాగ్‌పుర్ నుంచి సైన్యాన్ని దించాడు. ఈ సైన్యానికి, బాబూరావు దళాలకు మధ్య రెండుసార్లు పోరు సాగింది. ఏప్రిల్ 19న సగణాపుర్, 27న బామన్‌పేట్ వద్ద జరిగిన యుద్ధాల్లో మళ్లీ ఆంగ్లేయులకు పరాజయమే మిగిలింది. ఆదివాసీల గెరిల్లా యుద్ధతంత్రం ముందు తెల్లవారు నిలవలేకపోయారు. ఈ విజయంతో రెట్టించిన బాబూరావు.. ప్రాణహిత నది ఒడ్డునగల అహేరి జమీందారిలోగల టెలిగ్రాఫ్ శిబిరంపై దాడి చేసి ఆ వ్యవస్థను దెబ్బతీశారు. ఈస్టిండియా కంపెనీ ఉన్నత స్థాయిలో బాబూరావు విషయం చర్చకు వచ్చి.. కెప్టెన్ షేక్‌స్పియర్ అనే అధికారిని ప్రత్యేకంగా పంపించారు.
చాందా అడవుల్లో బాబూరావు సైన్యాన్ని ఓడించటం కష్టమని గ్రహించిన తెల్లవారు కొత్త ఎత్తుగడ వేశారు. బాబూరావు సమీప బంధువు.. అహేరి జమీందారి రాణి లక్ష్మీబాయికి ఎరవేశారు. బాబూరావును పట్టుకుంటే.. డబ్బుతో పాటు ఆమె అధికారాన్ని విస్తరింపజేస్తామని హామీ ఇచ్చారు. లేదంటే ఉన్న జమీందారీని లాక్కుంటామని బెదిరించారు. దానదండోపాయాల్లో ఏది పనిచేసిందోగానీ.. జులైలో లక్ష్మీబాయి సేనలు బాబూరావును భోపాలపట్నం వద్ద పట్టుకున్నాయి. పూజ కోసం వచ్చిన ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. బంధించి అహేరికి తీసుకొని వెళుతుంటే తన సైన్యంలోని రోహిల్లాల సాయంతో బాబూరావు తప్పించుకున్నాడు.
ఆంగ్లేయులు బాబూరావు చుట్టూ ఉచ్చు బిగించారు. సహచరులందరినీ దూరం చేశారు. లక్ష్మీబాయి ఓరోజు భోజనానికి పిలవటంతో నమ్మి వచ్చాడు బాబూరావు. ముందే విషయం తెలిసిన ఆంగ్లేయ సేనలు ఇంటిని చుట్టుముట్టి ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. ఈసారి కట్టుదిట్టంగా ఆయన్ను చాందా జైలుకు తరలించి రాజద్రోహం కేసు నమోదు చేశారు. అక్టోబరు 21న కోర్టు ఉరిశిక్ష విధించింది. మళ్లీ తప్పించుకుంటాడేమోననే భయంతో.. ఆంగ్లేయులు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే రోజు సాయంత్రం నాలుగున్నరకే చాందా జైలు ఎదురుగానున్న మర్రిచెట్టుకు వేలాడదీశారు. 25ఏళ్ల ఆ స్వాతంత్య్ర యోధుడిని చూసి ఉరితాడూ పురివిప్పుకొని అభినందించింది. మూడుసార్లు ఉరితాడు తెగింది. ఎట్టకేలకు నాలుగోసారి ఆయన ఊపిరి ఆగింది. అయినా ఆంగ్లేయులకు నమ్మకం కుదరలేదు. మళ్లీ ఎక్కడ లేచి వస్తాడోననే భయంతో బాబూరావు మృతదేహాన్ని సలసలమరిగే ద్రావణంలో ముంచి తీశారు. ఇందుకు కారణం లేకపోలేదు. బాబూరావుకు ఓ అసాధారణ శక్తి ఉండేదని ఆదివాసీలు భావించేవారు. ఆ శక్తివల్ల తన శరీరాన్ని అవసరమైనప్పుడు బండలా మార్చి.. తర్వాత మళ్లీ సాధారణస్థితికి తీసుకువచ్చేవాడనేవారు. ఉరితాడు తెగటానికి అదే కారణమని వారి భావన. అందుకే ఆంగ్లేయులు ఉరితాడును నమ్మకుండా వేడివేడి ద్రావణంలో ముంచి ఒకటికి రెండుసార్లు ఆయన మరణాన్ని ధ్రువీకరించుకున్నారు. ఏటా అక్టోబరు 21న చాందా జైలుముందున్న మర్రిచెట్టు వద్ద ఆదివాసీలు సమావేశమై.. వీర బాబూరావుకు నివాళులర్పిస్తారు.
ఇదీ చదవండి: కడ్డీ వంగినా.. మెడ వంచని.. జెండా దించని యోధుడు