ETV Bharat / bharat

'ప్లాసీ'కి ముందే ఆర్కాట్​లో బీజం.. భారతావనిలో ఆంగ్లేయుల రాజ్యం!

1757 ప్లాసీ యుద్ధంతో భారత్‌లో తెల్లవారి పాలనకు తెరలేచినా.. అంతకు ఆరేళ్ల ముందే ఆర్కాట్‌లో అందుకు బీజాలు పడ్డాయి. కేవలం వ్యాపారమే కాదు.. భూభాగమూ అధికారమూ సంపాదించుకోవచ్చని ఆంగ్లేయులకు అర్థమైంది ఆర్కాట్‌లోనే! విభజించు.. పాలించు సూత్రం తొట్టతొలుత ప్రయోగించి చూసిందీ ఇక్కడే!

azadi-ka-amrit-mahotsav Arcot War
azadi-ka-amrit-mahotsav Arcot War
author img

By

Published : Jun 23, 2022, 7:52 AM IST

వ్యాపారం కోసం భారత్‌లో అడుగుపెట్టిన ఫ్రెంచ్‌, డచ్‌, బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీలు.. భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. తూర్పు తీరంలో వాణిజ్యంపై ఆధిపత్యం కోసం తమలో తాము కలహించుకునేవి. ఈ క్రమంలో భారత్‌లోని రాజ్యాలు, రాజులనూ పావులగా చేసుకునేవి. అలా పావుగా మారిన 'ఆర్కాట్‌' చివరకు భారత చరిత్రనే మార్చేసింది. మొఘల్‌ సామ్రాజ్యం బలహీనమైన తర్వాత సామంతులే ఎక్కడికక్కడ రాజ్యమేలసాగారు. వీటిలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన కర్ణాటక సుల్తాన్‌ రాజ్యం ఒకటి. దీని రాజధాని ఆర్కాట్‌ (ప్రస్తుతం తమిళనాడులో ఉంది.) 1748లో ఒకటో నిజాం మరణించిన తర్వాత ఆర్కాట్‌ నవాబు సోదరుల్లో విభేదాలు తలెత్తాయి. ఆంగ్లేయ, ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీలు తమ ప్రైవేటు సైన్యంతో చెరొకరికి మద్దతిచ్చాయి. ఫ్రెంచ్‌ మద్దతిచ్చిన నవాబు చందాసాహిబ్‌ ఆర్కాట్‌ నవాబుగా పీఠమెక్కాడు. అక్కడితో ఆగకుండా.. పక్కనే తిరుచిరాపల్లిలో ఆంగ్లేయుల మద్దతున్న తన శత్రువు మహమ్మద్‌ అలీ ఖాన్‌ వాలాజాను ఓడించటానికి బయల్దేరాడు. చందాసాహిబ్‌తోపాటు ఫ్రెంచ్‌వారు కూడా తన ప్రాభవాన్ని విస్తరించటానికి ఊవిళ్లూరారు. బ్రిటిష్‌ వెనకంజలో ఉన్న దశ అది. తిరుచిరాపల్లిలో ఖాన్‌ వాలాజా ఓడిపోవటం ఖాయమని ఆంగ్లేయులకు అర్థమైపోయింది.

ఈ దశలో మద్రాసు ఈస్టిండియా కంపెనీలో పనిచేస్తున్న రాబర్ట్‌ క్లైవ్‌ రంగంలోకి దిగాడు. నేరుగా తిరుచిరాపల్లిలో ఫ్రెంచ్‌తో పోరాటానికి దిగకుండా భారతీయ రాజుల మధ్య ఉన్న వైరాన్ని తెలివిగా ఉపయోగించుకుందామంటూ మద్రాసు గవర్నర్‌కు ప్రతిపాదించాడు. ఏమీ పాలుపోని పరిస్థితిలో ఉన్న గవర్నర్‌ సరేనన్నాడు. వెంటనే క్లైవ్‌ 500 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని.. 1751 ఆగస్టు 26న బయల్దేరాడు. అయితే.. తిరుచిరాపల్లివైపు కాకుండా.. ఆర్కాట్‌వైపు! అప్పటికే చందాసాహిబ్‌ సేనలు ఆర్కాట్‌ను వీడి తిరుచిరాపల్లికి వెళ్లిపోయాయి. ఇటు క్లైవ్‌ తెలివిగా.. ఆర్కాట్‌ను ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన చందాసాహిబ్‌ అవాక్కయ్యాడు. ఫ్రెంచ్‌ ఈస్టిండియా సాయంతో తన కుమారుడు రాజాసాహిబ్‌ సారథ్యంలో సైనికదళాన్ని పంపించాడు. దాదాపు 50 రోజులు హోరాహోరీ పోరు సాగింది. ఒకవైపు పోరు సాగిస్తూనే.. ప్రజలకు, భూస్వాములకు భూమిని పంచిపెట్టి వారి మద్దతు పొందాడు క్లైవ్‌. మద్రాసు నుంచి అదనపు బలగాలు రావటంతో పాటు మరాఠా వీరుడు మురారీరావు అండగా నిలవటంతో.. 52వరోజు క్లైవ్‌ విజయభేరి మోగించాడు. రాజాసాహిబ్‌ తోకముడిచి వెల్లూరుకు వెళ్లిపోయాడు. ఈ ప్రాంతంపై వాణిజ్య హక్కులతో పాటు పన్నుల వసూలు అధికారం కూడా బ్రిటిష్‌ ఈస్టిండియా పరమైంది. ఆర్కాట్‌ విజయంతో రాబర్ట్‌ క్లైవ్‌.. బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ హీరోగా మారిపోయాడు. తర్వాత కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ అయ్యాడు. అంతేగాకుండా.. ఆర్కాట్‌ అనుభవం భారత్‌లో బ్రిటిష్‌వారి ఆలోచనా విధానాన్ని మార్చేసింది. వ్యాపారానికే పరిమితం కాకుండా రాజకీయ పెత్తనానికి ప్రేరేపించింది. స్థానిక రాజుల మధ్య విభేదాలను తెలివిగా వాడుకుంటే ఏం చేయొచ్చో తెలియజేసింది. విభజించి పాలించు విధానానికి బీజాలు వేసింది. ''శత్రువు తప్పిదమో.. క్లైవ్‌ అదృష్టమోగాని.. ఆర్కాట్‌లో గెలుపుతో ఆంగ్లేయుల ధైర్యం అనూహ్యంగా పెరిగిపోయింది. విజయ పరంపర మొదలైంది.'' అని క్లైవ్‌ జీవితకథ రాసిన మార్క్‌బెన్స్‌ వ్యాఖ్యానించాడు.

ఆర్కాట్‌ విజయం తర్వాత దక్షిణాదిలో చాలామంది సైనికులు (ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీలోనివారు) బ్రిటిష్‌ కంపెనీలో చేరారు. అంతేగాకుండా.. సిపాయిలుగా కొత్తవారు చేరటానికి ఉత్సాహం చూపించారు. ఆరేళ్ల తర్వాత 1757లో బెంగాల్‌లో మొఘల్‌ నవాబు సిరాజుద్దౌలాతో జరిగిన ప్లాసీ యుద్ధంలో కూడా.. రాబర్ట్‌ క్లైవ్‌ ఆర్కాట్‌ ఎత్తుగడనే అనుసరించాడు. సిరాజుద్దౌలా సమీప బంధువు.. ఆయన సైన్యంలో కీలకమైన మీర్‌జాఫర్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. గెలిస్తే తననే బెంగాల్‌ నవాబును చేస్తానని మాటిచ్చాడు. ఆ తంత్రం పనిచేసింది. అలా ఆర్కాట్‌లో వేసిన బీజాలను.. దేశమంతా నాటుకుంటూ.. దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు భారతావనిలో రాజ్యమేలారు!

ఇవీ చూడండి: నాయకులెవరూ లేని వేళ 'అరుణో'దయం.. క్విట్​ ఇండియాకు శ్రీకారం

'వాళ్లు పోరాటానికి పనికిరారు'.. సైన్యానికి జాతుల ముద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.