Holiday On Ram Mandir Pran Pratishtha January 22 : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోన్న వేళ.. దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఇప్పటికే.. జనవరి 16 నుంచి రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ(జనవరి 18న) గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చనున్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమైంది.
Ayodhya Ram Mandir : ఇదిలా ఉంటే.. అయోధ్య ధామ్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూపీతో సహా పలు రాష్ట్రాలు పాఠశాలలకు జనవరి 22న సెలవు ప్రకటించాయి. ఇంతకీ.. ఏయే రాష్ట్రాలు సెలవు ప్రకటించాయో ఇప్పుడు చూద్దాం..
ఉత్తర ప్రదేశ్ : అయోధ్య కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌లో.. జనవరి 22వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా.. ఆ రోజు రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయనున్నట్లు పేర్కొంది.
గోవా : జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని గోవా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ.. సీఎం ప్రమోద్ సావంత్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? ఈ మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు - పూర్తి వివరాలివే!
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అదేవిధంగా ఆ రోజు రాష్ట్రంలోని మద్యం, మాంసం దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండగ లాంటిదని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు.
హర్యానా : ఉత్తరప్రదేశ్‌ను ఆనుకొని ఉన్న మరో రాష్ట్రమైన హర్యానా సైతం సెలవు మంజూరు చేసింది. ఈ నెల 22న అన్ని పాఠశాలలు, కళాశాలలకు హాలిడే మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు రాష్ట్రంలోని మద్యం దుకాణాలనూ మూసివేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఛత్తీస్‌గఢ్ : అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేళ.. ఛత్తీస్‌గఢ్ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో పాటు 55 దేశాలకు చెందిన రాయబారులు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే దేశ నలుమూలల నుంచి సాధువులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. సాధారణ భక్తులు సైతం పెద్ద ఎత్తున ఈ వేడుకను చూసేందుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రపతికి లేఖ..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని .. జనవరి 22ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ న్యాయవాది లేఖ రాశారు. మరి, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
కళ్ల గంతలు విప్పి రాముడిని దర్శించుకోనున్న మోదీ- ఆయన తరఫున పూజలు చేసేది ఆ దంపతులే!
అయోధ్య వెళ్తున్నారా? రామమందిరంతోపాటు చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే! ఓ లుక్కేయండి!