ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నాటు బాంబులు కలకలం రేపాయి. ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ లాయర్లలో ఒకరైన దయాశంకర్ మిశ్రా ఇంటి సమీపంలో బాంబులు విసిరారు కొందరు దుండగులు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ పేలుళ్లలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, ఈ బాంబులు విసిరింది దయాశంకర్‌ను టార్గెట్ చేసి కాదని చెప్పారు. ఇద్దరు యువకుల వ్యక్తిగత గొడవల కారణంగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై అతీక్ అహ్మద్ లాయర్ దయాశంకర్ మిశ్రా స్పందించారు. తనను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా బాంబు దాడి చేశారని ఆరోపించారు. 'నేను కోర్టులో ఉన్నాను. మా ఇంటి వద్ద బాంబులు పేలాయని నా కుమారుడు చెప్పాడు. వెంటనే నేను ఇంటికి వచ్చాను. ఇదో పెద్ద కుట్ర. దీని వెనుక ఎవరున్నారో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులదే. ఈ బాంబు దాడి చేసిన వారిని తన కుమార్తె, కొందరు స్థానికులు చూశారు. ఇక్కడ మొత్తం మూడు బాంబులు పేలాయి' అని దయాశంకర్ ఆరోపించారు.
యూపీ పోలీసులకు NHRC నోటీసులు..
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ, ప్రయాగ్‌రాజ్ సీపీకి నోటీసులు పంపింది. ఈ హత్యలపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఆ నివేదికలో.. హత్యలకు దారితీసిన కారణాలు, మృతులకు సంబంధించిన మెడికల్.. లీగల్ పత్రాల నకలు, విచారణ నివేదిక, పోస్టు మార్టం పరీక్షల నివేదిక, హత్య జరిగిన ప్రదేశం సైట్ ప్లాన్, మెజిస్టీరియల్ ఎంక్వైరీ నివేదికలను పొందుపరచాలని చెప్పింది.
హత్య సీన్ రీక్రియేట్ చేయనున్న పోలీసులు..
అతీక్ అహ్మద్, అష్రఫ్ మహ్మద్ హత్య కేసులో దర్యాప్తు చేసేందుకు నియమించిన సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం.. క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేయనుందని సమాచారం. హత్య చేసిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఎలా ప్రయత్నించారు.. వారిని నియంత్రించేందుకు ఎంత సమయం పట్టింది అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ హత్యల దర్యాప్తు నిర్వహించేందుకు ప్రభుత్వం రెండు సిట్లను ఏర్పాటు చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్.. అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను దుండగులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు పరీక్షల కోసం తరలిస్తుండగా.. వారిని మీడియా ప్రతినిధులు అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీక్ ఆహ్మద్, అష్రఫ్ అహ్మద్‌పై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మొదట అతీఖ్ అహ్మద్ కణితిపై గురిపెట్టి కాల్చిన నిందితులు.. వారిద్దరూ కింద పడిపోగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అతీఖ్ అహ్మద్ తలపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఆయన వెంటనే కిందపడిపోయారు. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో అతిఖ్ అహ్మద్.. అష్రఫ్ అహ్మద్ చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. ఆ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.