Assam Meghalaya Historic Agreement: అసోం, మేఘాలయ మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సరిహద్దు వివాదం ఓ కొలిక్కివచ్చేలా కనిపిస్తోంది. దీనికి పరిష్కారం కోసం జరిగిన చారిత్రక ఒప్పందంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతకాలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో.. దిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలు, ఇతర అధికారులు కూడా సీఎంల వెంట దిల్లీ వెళ్లారు. హోం శాఖ పరిశీలన, ఆమోదం కోసం ముసాయిదా తీర్మానం సమర్పించిన రెండు నెలల అనంతరం.. ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జనవరి 31న ఇరు రాష్ట్రాల సీఎంలు.. అమిత్ షా కు ముసాయిదా తీర్మానం అందించారు.
అసోం, మేఘాలయ 884 కి.మీ. మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య 12 వివాదాస్పద ప్రాంతాల్లో.. తొలుత ఆరింటి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి. దీని ప్రకారం.. వివాదంగా ఉన్న 36.79 చదరపు కి.మీ. భూభాగంలో 18.51 చదరపు కి.మీ. అసోం వద్ద ఉండనుండగా.. మిగతా 18.28 చదరపు కి.మీ. మేఘాలయకు చెందేలా అంగీకారం కుదిరింది. 1972లో అసోం నుంచి మేఘాలయ విడిపోయిన సమయంలో తొలిసారి ఈ దీర్ఘకాలిక వివాదం సమస్య ఉత్పన్నమైంది. దీనిపై గతేడాది ఆగస్టులో రెండు రాష్ట్రాలు వేర్వేరుగా 3 కమిటీల చొప్పున నియమించాయి. పరిష్కారం దిశగా.. రెండు విడతలుగా చర్చలు కూడా జరిగాయి.
ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఇదో చారిత్రక రోజు అని అభివర్ణించారు అమిత్ షా. ఈ ఒప్పందంతో.. ఇరు దేశాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం అయిందని అన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మేఘాలయ సీఎం సంగ్మా. సరిహద్దు సమస్యను వీలైనంత తొందరంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. వివాదం పరిష్కారం కోసం తగిన సూచనలు చేస్తూ, చొరవ చూపిన అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. అసోం సీఎం కూడా బాగా చురుగ్గా వ్యవహరించారని చెప్పారు. మరో 6-7 నెలల్లో మిగతా వివాదాస్పద ప్రాంతాల సమస్యను కూడా పరిష్కరించుకునే దిశగా చర్యలు ప్రారంభిస్తామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇవీ చూడండి: 45 వెడ్స్ 25.. ఐదు నెలల క్రితం వైరల్.. ఇప్పుడు విషాదం.. పాపం ఆ అమ్మాయి...
రెండో రోజు కార్మిక సంఘాల సమ్మె.. రూ.18వేల కోట్ల లావాదేవీలకు బ్రేక్!