AP CID INTERROAGTED RAMOJI RAO: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరుతో సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. అనారోగ్యం వల్ల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కుమారుడు కిరణ్ ఇంట్లో ఉంటూ.. రామోజీరావు చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం పదిన్నరకు అక్కడికి వెళ్లిన.. సీఐడీ అధికారుల బృందం సుమారు 5 గంటల పాటు విచారించింది. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోయినా అడ్డగోలు ఆరోపణలతో మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ.. విచారించాలంటూ సంస్థ ఛైర్మన్ రామోజీరావుకు వారం క్రితం నోటీసులు జారీ చేసింది. ఇందులో పలు తేదీలను పేర్కొనగా.. సోమవారం విచారణకు రావొచ్చంటూ ఆయన సమ్మతి తెలిపారు.
5గంటలు.. 46 ప్రశ్నలు: సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో23మందితో కూడిన బృందం ఉదయం పదిన్నర గంటలకు.. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంది. పదకొండున్నరకు విచారణ ఆరంభించింది. గంట తర్వాత.. రామోజీరావు అనారోగ్యం కారణంగా అలసట చెందినట్టు కన్పించడంతో.. అధికారులు కాసేపు విరామమిచ్చారు. ఈ సమయంలో కుటుంబ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు... ఆయన్ను పరీక్షించారు. మళ్లీ రెండున్నరకు విచారణ ఆరంభించిన అధికారులు.. సాయంత్రం ఐదున్నర గంటలకు ముగించారు. ఏడున్నర గంటల వరకూ..అక్కడే ఉన్నారు. తాము నమోదు చేసిన కేసుకు సంబంధించి... మొత్తం 46 ప్రశ్నలు అడిగారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్య బృందం పర్యవేక్షణలో.. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు రామోజీరావు సమాధానాలు చెప్పారు.
ఈనాడుపై అక్కసుతోనే: విచారణలో భాగంగా రామోజీరావు వాంగ్మూలంలో.. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘మార్గదర్శికి సంబంధించిన సమాచారం మొత్తం.. ఆయా జిల్లాల్లోని బ్రాంచి కార్యాలయాల్లోనే ఉంటుందన్నారు. కొత్త చిట్‌ల తాలూకూ వివరాల నుంచి... ఆయా శాఖల్లో జరిగే కార్యకలాపాలన్నింటి సమాచారాన్ని చట్ట ప్రకారం ఎప్పటికప్పుడు చిట్స్‌ను పర్యవేక్షించే రిజిస్ట్రార్లకు పంపుతుంటామని చెప్పారు. అది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. అలా పంపిన సమాచారానికి సంబంధించి.. 60 ఏళ్లుగా రిజిస్ట్రార్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలుగానీ, ఫిర్యాదులుగానీ రాలేదన్నారు. ఉన్నట్టుండి.. ఇదంతా జరగడానికి ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కారణమని చెప్పారు.
‘ఈనాడు' నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురిస్తుందనే కోపం, అక్కసుతోనే.. వ్యక్తిగతంగా తనపైన, మార్గదర్శిపైనా బురద చల్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని.. రామోజీరావు చెప్పారు. అయితే దర్యాప్తు అధికారులు ఈ అంశాన్ని తొలుత నమోదు చేయలేదు. ఈ విషయాన్ని సీఐడీ అధికారులకు గుర్తుచేయడంతో.. చివరికి నమోదు చేశారు. వాంగ్మూలం తాలూకు వీడియో ఫుటేజీని ఇస్తామని తొలుత చెప్పిన సీఐడీ అధికారులు.. చివరికి ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ‘వాంగ్మూలంలోని సమాచారం విశ్లేషిస్తామని, అవసరమైతే.. మళ్లీ విచారణకు వస్తామన్నారు. ఎలాంటి అదనపు సమాచారం అవసరమో.. రాతపూర్వకంగా తెలియజేస్తే.. అందుకు తగిన సమయమిస్తే ఆ మేరకు పంపుతామని దర్యాప్తు అధికారికి రామోజీరావు తెలిపారు.
సీఐడీ బృందంలోని సిబ్బంది వచ్చీ రాగానే విచారణలో భాగం అంటూ.. బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న రామోజీరావు ఫొటో తీసుకున్నారు. వెంటనే ఆ ఫొటో.. సాక్షి టీవీలో ప్రసారమైంది. కొద్దిసేపటికి అదే ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ విషయాన్ని గమనించిన మార్గదర్శి సిబ్బంది సీఐడీ బృందం ఎదుట.. అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తీసిన ఫొటో బయటకు ఎలా వెళ్లిందనే ప్రశ్నకు.. వాళ్లు సమాధానం చెప్పలేదు. వాస్తవంగా విచారణలో భాగంగా.. దర్యాప్తు అధికారులు వీడియో, ఫొటోలు తీసుకోవచ్చు. వీటిని విచారణ నిమిత్తం మాత్రమే..వాడుకోవాలి. బయటకు పంపకూడదు. అలా పంపడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కిందికే వస్తుంది.
ఇవీ చదవండి: