Alwar Rape case: రాజస్థాన్ అల్వర్లో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఐదుగురు డాక్టర్ల బృందం జైపుర్లోని జేకే లోన్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధరించినట్లు చెప్పారు. అయితే బాలిక ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలున్నాయని, వాటికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. తదుపరి విచారణలో ఆ విషయం తెలిసే అవకాశముందని పేర్కొన్నారు. అంతేగాక బాలిక తనంతట తానే గ్రామం నుంచి పట్టణానికి వెళ్లిందని విచారణలో తెలిసిందని పోలీసులు వెల్లడించారు.
"బాలిక స్వగ్రామం నుంచి 25 కి.మీ ప్రయాణించి ఆటోలో అల్వర్ వచ్చింది. తిజారా ఫాటక్ వంతెన వద్దకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లింది. బాలిక కదలికలను మేం ట్రేస్ చేశాం. ఆమె ప్రయాణించిన ఆటోలో మరో 8-10మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ను కూడా విచారించాం. మిగతా ప్యాసెంజర్స్తో ఇంకా మాట్లాడాల్సి ఉంది. అల్వర్లో చాలా చోట్ల బాలిక నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ రికార్డుల్లో ఉంది. ఆమె మానకసిక స్థితి బాగానే ఉన్నట్లు కన్పించింది. అయితే ఆమె అపస్మారక స్థితికి సంబంధించిన దృశ్యాలు ఏ సీసీటీవీలోనూ కన్పించలేదు. బాలికకు తీవ్ర గాయాలు ఎలా అయ్యాయో ఇంకా తెలియాల్సి ఉంది."
-అల్వర్ ఎస్పీ తేజశ్వని గౌతమ్
ఈ ఘటనపై దర్యాప్తును సీఎం అశోక్ గహ్లోత్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.
తీవ్ర దుమారం..
జనవరి 12 మంగళవారం అర్ధరాత్రి అల్వర్ తిజారా ఫాటక్ సమీపంలోని ఓ వంతెన వద్ద తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న దివ్యాంగురాలిని స్థానికులు గుర్తించారు. ఆమె పరిస్థితి చూసి సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు మొదట అనుమానించారు. బాలిక ప్రైవేటు భాగాలపై గాయాలు ఉండటం కూడా ఇందుకు బలం చేకూర్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా దుమారం చెలరేగింది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
అయితే ఈ విషయంపై ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనంతో వ్యవహరించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కోరారు. పోలీసులు విచారణ పూర్తి చేసేందుకు సహకరించాలని, ఆ తర్వాతే ఏం మాట్లాడినా న్యాయంగా ఉంటుందని శుక్రవారం ట్వీట్ చేశారు. ఘటనపై డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 2.68లక్షల కరోనా కేసులు