మహారాష్ట్ర విరార్‌లోని నాలాసోపారాలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ఆమె భర్త, ప్రియుడు కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితురాలి ముఖం, చేతి భాగం తీవ్రంగా కాలిపోయాయి. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పెల్హర్ పోలీసులు.. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాలాసోపారాకు చెందిన కరిష్మా అలీ(20)కి తౌఫిక్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే కరిష్మాను ఆమె భర్త తౌఫిక్ నిత్యం కొడుతుండేవాడు. ఈ క్రమంలో బాధితురాలు అతడిని దూరంపెట్టి.. అదే ప్రాంతానికి చెందిన కమ్రాన్ అన్సారీ అనే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది. అయితే కమ్రాన్.. కరిష్మాను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడం వల్ల అతడిని కూడా వదిలేసింది.
ఆ తర్వాత నాలాసోపారాకు చెందిన కమల్ ఖాన్‌తో కలిసి ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న కరిష్మా భర్త తౌఫిక్, ప్రియుడు కమ్రాన్ అన్సారీ ఆమెతో గొడవపడ్డారు. కమల్ ఖాన్‌తో కలిసి ఉండొద్దని హెచ్చరించారు. అయితే బాధితురాలు కమల్‌తోనే కలిసి ఉంటానని చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలిపై కోపం పెంచుకున్నారు ఇద్దరు నిందితులు. సోమవారం రాత్రి బాధితురాలు కరిష్మా నిద్రిస్తున్న సమయంలో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. ఆ సమయంలో బాధితురాలి పక్కనే ఉన్న కమల్ ఖాన్‌కు సైతం గాయాలయ్యాయి. అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ప్రేమిస్తుందని..
ఉత్తర్‌ప్రదేశ్ గోండాలో దారుణం జరిగింది. తన సోదరి వేరే వ్యక్తిని ప్రేమిస్తుందన్న కోపంతో ఆమె సోదరుడు దారుణానికి పాల్పడ్డాడు. 18 ఏళ్ల బాధితురాలిని ఆమె సోదరుడు పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపేశాడు. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని(22) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది.
అత్యాచారం కేసులో ట్విస్ట్..
అత్యాచారం కేసులో ఓ వ్యక్తిని ఇరికించేందుకు ప్రయత్నించిన బాలిక, ఆమె తండ్రి, సోదరుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. కోర్టును తప్పుదోవ పట్టించి బాలికకు అబార్షన్ చేయించినందుకు ఈ శిక్ష ఖరారు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని దాతియాకు చెందిన ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెపై సోనూ పరిహార్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి హైకోర్టులో కేసు వేశాడు. గతేడాది మార్చి 8న ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమెకు అబార్షన్ చేయించేందుకు కూడా కోర్టు అనుమతించింది. అయితే ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
బాధితురాలికి తన బంధువుతో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆమె గర్భం దాల్చిందని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. ఈ కేసులో దాతియా పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేయడం సహా.. బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకోవాలని సూచించింది. సోనూ తనపై అత్యాచారం చేయలేదని.. తాను మైనర్ కూడా కాదని బాధితురాలు వాంగ్మూలంలో తెలిపింది. బాధితురాలు, ఆమె తండ్రి, సోదరుడు పలుమార్లు వాంగ్మూలాలను తప్పుగా చెప్తున్నారని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇవీ చదవండి: స్మగ్లింగ్‌కు సీఎం అండ.. నిరూపిస్తే రాజీనామా చేస్తారా అంటూ గవర్నర్ సవాల్