ఆగి ఉన్న బస్సును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే పది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గుజరాత్లో జరిగిందీ ఘటన. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కొందరు ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
కలోల్ తాలుకాలోని అంబికానగర్ బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బస్సు వచ్చి ఆగగా.. కొందరు ప్రయాణికులు దాని ఎదురుగా నిలబడ్డారు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన మరో ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. దీంతో ఎదురుగా నిల్చున్న ప్రయాణికలపైకి బస్సు దూసుకెళ్లింది. ఫలితంగా 10 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బాకాజీ ఠాకూర్, డీఎస్పీ ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నదిలో పడి 24 మంది మృతి
Madhya Pradesh Bus Accident Today : మరోవైపు మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది మరణించారు. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి 20 అడుగుల ఎత్తున వంతెన నుంచి బోరాడ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ జరిగింది
ఊన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోంగర్‌గావ్‌లో గ్రామ సమీపంలో 20 అడుగుల వంతెనపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. మంగళవారం ఉదయం 8.40 గంటలకు అదుపు తప్పి బోరాడ్ నదిలో పడిపోయింది. ఏం జరిగిందో తెలిసే లోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. అంత ఎత్తు నుంచి పడడం వల్ల బస్సు నుజ్జునుజ్జు అయింది. ఫలితంగా లోపల ఉన్నవారు బయటకు రావడం కష్టమైంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సభ్యులు.. స్థానికులతో కలిసి బస్సు నుంచి క్షతగాత్రులను వెలికి తీశారు. అనంతరం ఖర్గోన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఖర్గోన్ జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ, ఎస్పీ ధరమ్వీర్ సింగ్ జోషి, స్థానిక శాసనసభ్యుడు రవి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.
ఇవీ చదవండి : లేడీ డాక్టర్‌ను పొడిచి చంపిన రోగి.. ట్రీట్మెంట్ చేస్తుండగానే..
అన్నం వండలేదని ఇటుకతో కొట్టి భార్య హత్య.. 'ఆమె'పై కోపంతో ఉరేసుకున్న భర్త!