ఈ బస్సుకు చక్రాలు ఉన్నాయి.. డ్రైవర్ కూడా ఉన్నాడు.. కానీ అంగుళం కూడా కదల్లేదు. ఎందుకంటే ఇది చూడటానికి అచ్చం బస్సులానే కనిపించే ఇల్లు. దగ్గరగా వెళ్లి నిశితంగా పరిశీలిస్తే గానీ.. అది ఇల్లు అని గుర్తించలేరు.
బంగాల్‌కు చెందిన ఉదయ్ దాస్ అనే కళాకారుడు.. తన నైపుణ్యానికి సృజనాత్మకతను జోడించి ఈ అద్భుతమైన బస్సు ఇంటిని నిర్మించాడు. బీర్భూమ్ జిల్లా పరుయ్‌లోని ధోనై గ్రామానికి చెందిన అతడికి.. బస్సు నడపడమంటే ఎంతో ఇష్టం. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. అందుకే ఇంటికే ఇలా బస్సు రూపమిచ్చాడు.
"పాత ఇంట్లో తగినంత స్థలం లేదు. కాబట్టి నేను ఇంటిని బస్సు ఆకారంలో రూపొందించాలని నిర్ణయించుకున్నాను. అలాగే నిర్మించాను. ఈ ఇల్లు చూడటానికి లోపల, బయట బస్సులానే ఉంటుంది. డ్రైవర్ కూర్చున్న దగ్గర నుంచి ప్రయాణీకుల సీట్లు వరకు బస్సులో ఉండేలానే ఉంటాయి. ఇప్పుడు అతిథులు వచ్చినప్పుడు.. వారిని కూర్చోమని చెప్పగలగుతన్నాను. ప్రభుత్వ సాయం అందితే సంతోషంగా ఉండేది."
- ఉదయ్ దాస్, కళాకారుడు
మట్టి, సిమెంట్‌తో బొమ్మలు తయారు చేయడంలో ఉదయ్ నిష్ణాతుడు. ఆ పని చేసుకునే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వరకు అతని కుటుంబం నివసించడానికి సరైన ఇల్లు కూడా లేదు. అయితే.. తన అభిరుచి, సృజనను కలిపి ఇలా బస్సు ఇంటిని నిర్మించాక.. చుట్టుపక్కల ప్రత్యేక గుర్తింపు పొందాడు.
ఇదీ చూడండి: కరోనా వేళ క్రియేటివిటీ.. ఇంట్లో ఉంటూనే విమానయానం!