School Bus Overturned in Kesamudram : నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరని పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా.. ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటిపై అధికారులు, పోలీసులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా వారు ప్రమాదాల బారిన పడటంతో పాటు వేరే కుటుంబాలనూ అంధకారంలోకి నెట్టివేస్తున్నారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. పాఠశాల నుంచి పలు తండాలు , గ్రామాలకు విద్యార్థులను ఇంటికి తీసుకు వెళుతున్న క్రమంలో.. కేసముద్రం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చిన్నారులను బస్సులో నుంచి బయటకు తీసి కాపాడారు. విద్యార్థులందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడిపాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి : Road Accident in Outer Ring Road : ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి
ORR Accidents Today : నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి