తరాలు మారాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఆదివాసీల జీవితాలు మాత్రం మారడం లేదు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కిలో మీటర్ల మేర నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఆ నడిచే దారి కూడా సరిగా ఉండదు. మరోవైపు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆసుపత్రి తీసుకెళ్లేందుకు వారు పడే బాధలు వర్ణణాతీతం. చిన్నా పెద్దా ఎవరైనా గూడెం దాటాలంటే కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. నేటికీ కనీస వసతులకు దూరంగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి జీవితాలు మారుస్తామని నేతలు హామీలు ఇస్తున్నా.. అవి కార్యరూపం దాల్చడం లేదు. దీంతో వారి బతుకులు మారడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఓ పసిపాప ఆకలి తీర్చేందుకు ఆ కుటుంబ సభ్యులు రోజూ నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వివిధ మార్గాల్లో ప్రయాణించి ఆ పసి పాప ఆకలి తీరుస్తున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అది ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గిరిజన గూడెం. అందులో 6 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. 10 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్తే గానీ వారి అవసరాలు తీరని పరిస్థితి. ఆ గూడెంలోని ఓ పసిపాప ఆకలి తీర్చేందుకు కూడా కుటుంబీకులు ప్రతిరోజూ 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. వారు కొంత దూరం కాలిబాటలో నడిచి.. మరికొంత దూరం ఆ మార్గంలో వెళ్లే వాహనాలను అందిపుచ్చుకొని ప్రయాణం చేయాల్సి వస్తోంది.

పసిపాప ఆకలి తీర్చేందుకు నానా పాట్లు: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని రాజుగూడకు చెందిన కొడప పారుబాయి జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్‌సీలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం కుటుంబసభ్యులు పారుబాయితో పాటు పసికందును మరుసటి రోజున గూడేనికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పది రోజులకు తల్లి అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటి నుంచి ఆ పసి పాప ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు నానా పాట్లు పడుతున్నారు.

వారిలో ఎవరో ఒకరు ప్రతిరోజూ రాజుగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని చిద్దరి ఖానాపూర్ వరకు కాలినడకన ప్రయాణించి.. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లికి వాహనాల్లో వెళ్తూ పాల ప్యాకెట్ కొని తీసుకొస్తున్నారు. ఈ గూడెంలో ఎవరికి ఆవుగానీ, మేకగానీ లేదు. దీంతో కనీసం పసిపాప ఆకలి తీర్చడానికైనా ఆవు మంజూరు చేయాలంటూ.. ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నామని బాపురావు తెలిపారు. కానీ ఇప్పటి వరకూ మంజూరవలేదని ఆయన వివరించారు.
ఇవీ చదవండి: పంట నష్టం అంచనాకు వ్యవసాయ శాఖ ని'బంధనాలు'
పద్మ భూషణ్ అందుకున్న మంగళం బిర్లా.. అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం