గుజరాత్లో అమానవీయ ఘటన జరిగింది. కన్న కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామంధుడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ 35 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కృష్ణనగర్‌లో నివసిస్తున్నాడు. అతడికి భార్య, 8 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. బాలిక తల్లి ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో బాలిక, ఆమె తండ్రి మాత్రమే ఉన్నారు. ఆ సమయాన్ని అనువుగా తీసుకున్న తండ్రి.. మైనర్ కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన గురించి బాలిక ఎవరికీ చెప్పలేదు. ఆమె ఆరోగ్యం క్షీణించడం వల్ల.. బాలిక తల్లి మొదట ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యుల సూచనతో జీసీఎస్ ఆస్పత్రికి తరలించింది.
బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రేప్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. బాలిక అత్యాచారానికి గురైందని తెలుసుకున్న పోలీసులు.. ఆమె తల్లికి చెప్పారు. ఈ విషయమై తల్లి బాలికను ప్రశ్నించగా.. జరిగిందంతా చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
శిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి..
పెళ్లి కాకుండానే ప్రసవించిన ఓ యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి విసిరేసింది. తీవ్రగాయాలతో ఆ శిశువు ప్రాణం వదిలాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు దిల్లీలోని న్యూ అశోక్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వద్ద కొందరు మహిళలు సోమవారం ఉదయం చలిమంట వేసుకొని ఉండగా పైనుంచి ఏదో వస్తువు కిందపడినట్లు పెద్ద శబ్దం వినిపించింది. వారు వెళ్లి చూడగా, ఓ శిశువు రక్తమోడుతూ కనిపించాడు. వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్లో ఉండేవారిని ఆరాతీశారు. ఓ ఇంట్లో రక్తపు మరకలు కనిపించగా.. గట్టిగా అడిగారు పోలీసులు. ఆ మహిళ నేరం అంగీకరించింది. పెళ్లి కాకుండానే బిడ్డను ప్రసవించిన విషయం ఇతరులకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతోనే శిశువును కిటికీలోంచి పడేసినట్లు నిందితురాలు చెప్పింది.
భర్తను చంపిన భార్య..
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో చంపింది. తన ఇద్దరు కుమార్తెల సహాయంతో శవాన్ని పొలంలో పూడ్చిపెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉదయ్‌పుర్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది.. రూపాలాల్ మీనా(49) అనే వ్యక్తి ఉదయ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతడికి భార్య శారద, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రూపాలాల్ను అతడి భార్య గొడ్డలితో నరికి చంపింది. తన కుమార్తెల సహాయంతో మృతదేహాన్ని పోలంలో పాతి పెట్టింది. అనంతరం రూపాలాల్ గురించి అడిగితే.. పనికోసం వెళ్లాడని.. కొన్ని రోజుల వరకు రాడని నమ్మించింది. కాగా, ఓ రోజు రూపాలాల్ సోదరుడు.. కొందరితో పోలానికి వెళ్లగా.. వాసన రావడం గమనించాడు. అక్కడే ఉన్న బండరాయిని తొలగించాడు. అక్కడ మనిషి పుర్రెతో పాటు ఎముకలు కనిపించాయి. ఇంటికి వచ్చి రూపాలాల్ భార్యను నిలదీశాడు. ఆ మరునాడు ఆమె పారిపోయింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు రూపాలాల్ సోదరుడు. పరారీలో ఉన్న మహిళను అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నించారు. రూపాలాల్ను తానే హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది.
అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్య..
అప్పులు ఎక్కువయ్యాయనే బాధతో ఓ కుటంబం బలవన్మరణానికి పాల్పడింది. చిన్నారితో పాటు భార్యాభర్తలు ఆత్యహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన గుజరాత్‌లోని వడోదరాలో జరిగింది. మృతులను ప్రతేశ్ భాయ్ ప్రతాప్ భాయ్ మిస్త్రీ, అతడి భార్య స్నేహల్ బెన్, కుమారుడు హర్షిల్గా గుర్తించారు. ప్రతేశ్ తల్లి ఉదయం అతడి ఇంటికి వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. మిగతా ఇద్దరి మృతదేహాలు గదిలో పడిఉన్నాయి. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
"అప్పు ఎక్కువ అయిపోయింది. మేము కుటుంబం నుంచి విడిపోయి 6-7 సంవత్సరాలు అయింది. ఆర్థికంగా భారంగా ఉంది. అమ్మా.. మేము ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించు. మా ఇష్టంతోనే మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. పోలీసు కమిషనర్‌కు ఇదే మా విజ్ఞప్తి" అని సూసైడ్ నోట్లో మృతుడు రాసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డబ్బు ఆశతో బాలుడిని చంపిన సవతి తల్లి..
డబ్బు ఆశతో 8 ఏళ్ల బాలుడిని చంపిన ఓ సవతి తల్లికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. మురార్ ప్రాంతలో నివాసం ఉండే రాజు పరిహార్ భార్య సీమ.. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో అతడు ఆరాధన అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా, సీమ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు రూ. 8 లక్షలు మంజూరయ్యాయి. వాటిని సీమ కుమారుడు నితిన్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు రాజు.
ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలని అనుకున్న అరాధన.. రాజు లేని సమయంలో నితిన్‌కు విషం కలిపిన టీని ఇచ్చింది. రాజు వచ్చేసరికి బాలుడి ఆరోగ్యం విషమించింది. దీంతో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు రాజు. తన సవతి తల్లి ఇచ్చిన టీ వల్లనే ఇలా అయిందని బాలుడు చెప్పాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజు.. ఆరాధనపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన 22 సెప్టెంబర్ 2021లో జరిగింది. కాగా, ఈ కేసుపై విచారణ చేపట్టిన అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు.. ఆరాధనను దోషిగా తేల్చుతూ జీవితఖైదు విధించింది.
గ్యాంగ్‌రేప్ ఆరోపణలపై ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు..
గ్యాంగ్ రేప్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజ్‌గఢ్ ఎమ్మెల్యే జొహారీ లాల్ మీనా కుమారుడు దీపక్ మీనాపై .. 2022 మార్చిలో ఓ పదో తరగతి విద్యార్థి మాండ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీపక్‌తో పాటు మిగతా నిందితులు వివేక్ శర్మ, నరేశ్ సమ్లేటిపై గ్యాంప్ రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో రాజస్థాన్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి.. వివేక్ శర్మ, నరేశ్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, దీపక్‌ను అరెస్ట్ చేయకపోవడం వల్ల బాధితురాలి తరఫున లాయర్ దౌసా.. పోక్సో కోర్టును ఆశ్రయించారు. దీపక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. అనంతరం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో దీపక్ ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. నిందితుడు సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) ఫైల్ చేశారు. నిందితుడు తప్పించుకోకుండా.. బాధితురాలి లాయర్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 23లోగా దీపక్‌ను అరెస్ట్ చేయాలని.. లేకపోతే దౌసా ఎస్పీ హైకోర్టులో హాజరు కావాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలతో సోమవారం దీపక్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం దౌసా పోక్సో కోర్టులో నిందితుడు దీపక్‌ను హాజరుపరిచారు.