నదిలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 8 మంది రైతులు మరణించారు. ఇప్పటివరకు 14 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగ్‌రాజ్‌పుర్ గ్రామానికి చెందిన రైతులు.. నిజాంపుర్ పులియా మండీలో దోసకాయలు అమ్మి తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. పాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రా నదిపై నిర్మించిన బ్రిడ్జికి రెయిలింగ్ లేదు. దీంతో ట్రాక్టర్ బ్రిడ్జి వద్దకు చేరుకునే సమయానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. విషయం గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కొంత మందిని కాపాడారు.
జిల్లా మెజిస్ట్రేట్ సహా అధికారులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేపలు పట్టేవారితో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అయితే, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం కారణంగా సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. దీంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయం తీసుకున్నారు. రాత్రికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలో పడిన ట్రాక్టర్ ట్రాలీని బయటకు తీశాయి. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించిన బృందాలు 8 మంది మృతదేహాలను వెలికి తీశాయి. అంతకుముందే 14 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. మృతులకు రూ.5 లక్షలు ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి రజ్నీ తివారీ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఒకరిని కాపాడబోయి నలుగురు మృతి..
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. వాటర్ ట్యాంక్‌లో పడ్డ 13ఏళ్ల బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మేర్ జిల్లా నజీరాబాద్ సబ్‌డివిజన్ లవేరా గ్రామానికి చెందిన సురేంద్ర గుర్జర్ అనే బాలుడు నీళ్లు తాగడానికి పొలం సమీపంలోని బావి దగ్గర నిర్మించిన ట్యాంకు వద్దకు వెళ్లాడు. ట్యాంకులో మూడు అడుగుల మేర నీరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్యాంకులోకి దిగిన బాలుడు ఇంకా తిరిగి రాలేదని అక్కడ పొలంలో పనిచేస్తున్న శౌతాన్ గుర్జర్... వెళ్లి పరిశీలించాడు. ఈ క్రమంలోనే ట్యాంకులోకి దిగిన శౌతాన్ బయటకు రాలేదు. ఇలా మరో ఆరుగురు సురేంద్రను కాపాడటానికి వెళ్లి తిరిగి రాలేదు. వారంతా అక్కడే స్పృహ కోల్పోయారు. దీంతో సురేంద్ర మామయ్య మహేంద్ర గుర్జర్ చుట్టు పక్కల పొలల్లో ఉన్న వాళ్లను పిలిచాడు.
వారి సహాయంతో అందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆశ్చర్యకరంగా తొలుత ట్యాంకులోకి దిగిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన ఏడుగురిలో నలుగురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా ముగ్గురిని అజ్మేర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోలీసులు శవపరీక్షలకు పంపారు. మృతులంతా లవేరా గ్రామానికి చెందిన వారని గుర్తించారు. బావిలోని విషపూరిత వాయువు కారణంగానే చనిపోయారని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, కచ్చితమైన కారణం ఇంకా తెలియదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పిక్నిక్ కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
మధ్యప్రదేశ్ సింగ్రౌలి నుంచి 14 మంది పిక్నిక్ కోసం కోరియా ప్రాంతంలో ఉన్న రాందహ జలపాతం వద్దతు వచ్చారు. ఆరుగురు ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయారు. గ్రామస్థుల సహాయంతో రెండు మృతుదేహాలను వెలికితీశారు. నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇవీ చూడండి: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారన్న రాజ్‌నాథ్ సింగ్
పేకమేడల్లా కూలిన ట్విన్ టవర్స్, ఆఖరి నిమిషంలో గాలి ట్విస్ట్ ఇచ్చినా