ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించింది ఓ ముఠా. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితుల చెర నుంచి నలుగురు మహిళలను రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జబల్‌పుర్‌కు చెందిన సన్నీ సొంధియా, నిధీ సొంధియా దంపతులు సహా దర్భంగాకు చెందిన పింటూ కుమార్ ఠాకుర్లు ఉద్యోగాల పేరుతో మహిళలను నమ్మించి వారిని బిహార్‌కు తరిలించేవారు. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తూ.. పెళ్లి వేడుకల్లో వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించేవారు. వీటిని పింటూ కుమార్‌తో పాటు లవ్కుష్ రాయ్, మహేశ్వర్ శర్మ అలియాస్ రామ్ సాగర్ అనే మరో ఇద్దరు నిందితులు నిర్వహించేవారు.
అయితే ఏప్రిల్ 11న ఈ ముఠా ముగ్గురు మహిళలను ఉద్యోగాల పేరుతో బిహార్‌కు తరలించిందని జబల్పుర్ పోలీసులకు ఇటీవల సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు.. బిహార్ పోలీసుల సాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మోతీహరీ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహేశ్వర్ శర్మ అలియాస్ రామ్ సాగర్ కోసం గాలిస్తున్నారు. నిందితుల చెరలో ఉన్న నలుగురు మహిళలను రక్షించారు.
ఇదీ చూడండి : భార్య, మరదలిని హత్య చేసి.. ఇంట్లోనే దాచిపెట్టి..