కోట్ల రూపాయలు విలువ చేసే అంబర్‌గ్రీస్‌ను (తిమింగళం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. ఈ క్రమంలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంబర్‌గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.25 కోట్లు ఉంటుందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తూత్తుకుడిలోని తిరుచెందూర్‌లో ఓ కారులో అక్రమంగా అంబర్‌గ్రీస్‌ను తరలిస్తున్నారని కులశేఖరపట్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కారును అడ్డగించి నిందితుల నుంచి అంబర్‌గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విరుద్నగర్కు చెందిన తంగపాండి, ధర్మరాజ్, కింగ్స్లే, మోహన్.. తూత్తుకుడికి చెందిన రాజన్, కారు డ్రైవర్ కరుప్పస్వామిగా గుర్తించారు. మూడు కవర్లలో తరలిస్తున్న అంబర్‌గ్రీస్ బరుపు 25 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీని ధర మార్కెట్లో రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ క్రమంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అంబర్‌గ్రీస్‌ను తిరుచెందూరు అటవీశాఖ అధికారులకు అప్పగించారు కులశేఖరపట్నం పోలీసులు.
అంబర్‌గ్రీస్ అంటే..
అంబర్‌గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్ఫ్యూమ్ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్గ్రీస్కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేసియా, ఇంగ్లాండ్‌లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్‌గ్రీస్ స్మగ్లింగ్‌ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.