జమ్ముకశ్మీర్ కుల్గామ్‌లో ఉగ్రవాదులతో పోరులో అమరుడైన నాయక్ దీపక్ నైన్వాల్ భార్య 32 ఏళ్ల జ్యోతి నైన్వాల్.. భారత సైన్యంలో అధికారిగా నియమితులయ్యారు. తద్వారా తన భర్త చివరి కోరికను నెరవేర్చారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన జ్యోతి.. సైన్యంలో చేరేందుకు నిర్విరామంగా శ్రమించినట్లు పేర్కొన్నారు.
తన భర్త దీపక్ నైన్వాల్.. 2018 ఏప్రిల్‌లో కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో గాయపడ్డారు. 40 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. అదే ఏడాది మే నెలలో మరణించాడు. ఆయన మృతి చెందిన రెండున్నరేళ్ల తర్వాత 2021 జనవరిలో ఆర్మీ శిక్షణలో చేరిన జ్యోతి.. శనివారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతి.. " నా భర్త రెజిమెంట్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. వారు అడుగడుగునా నాకు అండగా నిలిచారు. కూతురిలా చూసుకున్నారు" అని పేర్కొన్నారు.
తమిళనాడు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి మొత్తం 178 మంది క్యాడెట్లు పాసయ్యారు. వారిలో 124 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉండగా.. 25 మంది విదేశీయులు కూడా ఉత్తీర్ణులయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సమీక్షించారు. మెరుగైన ప్రదర్శన చేసిన ఏసీఏ సిద్ధాంత్ శర్మకు స్వోర్డ్ ఆఫ్ హానర్ ఓటీఏ బంగారు పతకాన్ని, బీయూఓ డింపుల్ సింగ్ భాటికి రజత పతకాన్ని, బీసీఏ మునీష్ కుమార్‌కు కాంస్య పతకాన్ని అందజేశారు.
ఏడుగురు అఫ్గాన్ క్యాడెట్లు
చెన్నై అకాడమీలో సమీకృత ఆర్మీ శిక్షణా కార్యక్రమంలో ఉత్తీర్ణత సాధించినవారిలో అఫ్గానిస్థాన్‌కు చెందిన ఏడుగురు క్యాడెట్లు ఉన్నారు. ఈ ఏడుగురు.. దిల్లీలోని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆదివారం రిపోర్టు చేయనున్నారు. అక్కడి తమ అధికారులను సంప్రదించి తదుపరి కార్యచరణపై దృష్టి సారించనున్నారు.
ఈ క్యాడెట్లు భారత్‌లో శిక్షణలో ఉన్న సమయంలో తాలిబన్లు అఫ్గాన్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. తర్వాత అక్కడ సైనికులపై ఉక్కుపాదం మోపారు. దీంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఇదీ చూడండి: swachh survekshan 2021:వరుసగా ఐదోసారి క్లీనెస్ట్ సిటీగా 'ఇండోర్'