Morbi bridge collapse : గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటన.. అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఓ భాజపా ఎంపీ ఏకంగా 12 మంది కుటుంబసభ్యులను కోల్పోవడం తీవ్ర విచారకరం. రాజ్‌కోట్ ఎంపీ మోహన్‌భాయ్ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
"తీగల వంతెన కూలిన ప్రమాదంలో నేను 12 మంది కుటుంబసభ్యులను కోల్పోయాను. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా నా సోదరి కుటుంబానికి చెందినవారు" అని కల్యాణ్‌జీ కుందారియా ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వంతెన అనుమతుల గురించి వస్తున్న వార్తలపైనా ఎంపీ స్పందించారు. "ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తాం. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు" అని విచారం వ్యక్తం చేశారు.
మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ పాలన కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలింది. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడం వల్ల.. అధిక బరువును మోయలేక వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అయితే కొన్నేళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనకు దాదాపు 7 నెలల పాటు మరమ్మతులు చేసి ఈ నెల 26నే తిరిగి తెరిచారు. ఈలోపే ఈ ఘోర దుర్ఘటన జరిగింది.
ఇవీ చదవండి: 'సీఏఏపై దాఖలైన పిటిషన్లు కొట్టేయండి'.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
కాటేసిన పాముపై రివేంజ్.. సర్పాన్ని కరిచిన బాలుడు.. పిల్లాడు సేఫ్.. పాము మృతి