10th Class papers lost in Adilabad: పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిన్న పరీక్ష ప్రారంభమైన మొదటి పది నిమిషాలోనే వికారాబాద్ జిల్లాలో వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైన ఘటన చోటుచేసుకోగా.. తాజాగా మరో ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సోమవారం తెలుగు పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాల్లో ఒక కట్ట మాయమైంది.
ఉట్నూరు ఎస్.ఐ భరత్ సుమన్ తెలిపిన వివరాలు ప్రకారం.. ఉట్నూరులో పరీక్ష రాసేందుకు 1,011 మంది విద్యార్థులకు అయిదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జవాబుపత్రాలను ఆయా కేంద్రాల పరీక్షలు నిర్వహణ అధికారులు తపాలా కార్యాలయంలో అప్పజెప్పారు. అక్కడి సిబ్బంది పత్రాలన్నింటినీ 11 కట్టలుగా విభజించి మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు బస్టాండ్‌కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి కట్టలను లెక్కించారు. 11 బదులు పది కట్టలే ఉండడంతో వారు కంగుతిన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.
జవాబు పత్రాల కట్ట కోసం ప్రధాన రహదారితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ జవాబు పత్రాలు కోసం వెతికారు. ఎంతకి దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్ పోస్టుమాస్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. వెల్లడించారు. ఈ జవాబు పత్రాల కట్ట ఏ పరీక్ష కేంద్రానికి సంబంధించిందో ఇంకా తెలియరాలేదు. మరోవైపు జవాబు పత్రాలు మాయమైనట్లు వార్తలు రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎంఈవో కార్యాలయానికి వెళ్లిన జిల్లా అధికారులు: ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా అధికారులు.. ఉట్నూర్ ఎంఈవో కార్యాలయానికి వెళ్లి విద్యాశాఖ అధికారులను విచారిస్తున్నారు. అనంతరం తపాలా కార్యాలయం, పీఎస్ సందర్శించారు. ఆటోలో జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా పేపర్లు పోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అధికారులలో అడిషనల్ కలెక్టర్, డీఈవో, డీఎస్పీ ఉన్నారు.
ప్రశ్నాపత్రం లీకు కాలేదు.. మాల్ ప్రాక్టీస్ చేశారు: మరోవైపు నిన్న వికారాబాద్ జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనలో నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్ సస్పెన్షన్. ఇన్విజిలేటర్లు బందప్ప, సమ్మప్ప సస్పెన్షన్ అయ్యారు. పరీక్ష ప్రారంభమయ్యాక బందెప్ప ప్రశ్నపత్రం ఫొటో తీసి ఉ.9.37కు సమ్మప్పకు బందెప్ప ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పంపినట్లు గుర్తించారు.
ఉపాధ్యాయుడు బందెప్ప మాల్ ప్రాక్టీస్ చేశారని.. ప్రశ్నాపత్రం లీకు కాలేదని వివరించారు. అప్పటికే విద్యార్థులు వారివారి పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లి ప్రశాంతంగా పరీక్షలు రాసుకుంటున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలు యథాతథంగా నడుస్తాయని ప్రకటించారు.
ఇవీ చదవండి:
పదో తరగతి పేపర్ లీకేజీ అంశం.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
67కోట్ల మంది డేటా ఒక్కడే చోరీ చేశాడా..! అసలు నిందితులు ఎవరు?