TGSRTC Bus Running for Two Services : ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులకు ఒక రంగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, సూపర్ లగ్జరీ బస్సులకు ఒక రంగు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక వైపు పల్లె వెలుగు కలర్, మరోవైపు ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సు రంగు ఉంటే ఆశ్చర్యమే కదా. కొత్తగూడెం ఆర్టీసీ డిపో పరిధిలో ఓ బస్సు ఇలాగే తిరుగుతుంది. పల్లె వెలుగు బస్సు అనుకుని ఎక్కుతున్న ప్రయాణికులు, ఆ తర్వాత అది ఎక్స్‌ప్రెస్ అని తెలుసుకుని కంగుతింటున్నారు.
బస్సుకు ముందు భాగంలో ఎక్స్‌ప్రెస్ కలర్ ఉండగా, మిగతా అంతా పల్లె వెలుగు రంగు ఉంది. దీంతో తమ ఊర్లలో ఆగుతుందనుకుని బస్సెక్కిన ప్రయాణికులు, తర్వాత అది ఎక్స్‌ప్రెస్ అని, అన్నిచోట్లా ఆగదని తెలుసుకుని కంగుతింటున్నారు. బస్సుల కొరతతో ఒకే బస్సుకు రెండు సర్వీసుల రంగులు వేయించామని, రద్దీకి అనుగుణంగా వాటిని నడుపుతున్నామని డిపో మేనేజర్ వివరించారు.