Nizam College Students Protest Update : నిజాం కళాశాల యూజీ విద్యార్థినులు గత 6 రోజులుగా చేస్తున్న ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీతో విద్యార్థినులు తాత్కాలికంగా నిరసనను విరమించారు. వారి ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున బల్మూరి వెంకట్ నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపల్‌తో చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు.
సెప్టెంబర్ నాటికి పీజీ విద్యార్థినుల అకాడమిక్ ఇయర్ పూర్తవుతుందని, ఆ తర్వాత 100 శాతం డిగ్రీ వాళ్లకే హాస్టల్ ఉంటుందని బల్మూరి వెంకట్ వారికి హామీ ఇచ్చారు. అమెరికా నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాగానే శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. మూడు రోజుల్లో అధికారిక సర్క్యులర్ ఇప్పిస్తామనే హామీపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సర్క్యులర్ రాకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరోపక్క పీజీ విద్యార్థినులు తమకు న్యాయం కోరారు.