Vattem Pumphouse Motors Floated Up : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం జలాశయం వద్ద పంపుహౌస్‌లో నీటమునిగిన మోటార్లు బుధవారం తేలాయి. అధికారులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి, పంపుహౌజ్‌లో నిండిన నీటిని అధిక సామర్థ్యం గల మోటార్లతో ఎత్తిపోశారు. ఈనెల 2న భారీ వర్షాలకు శ్రీపురం, ఉయ్యాలవాడ, కుమ్మెర గ్రామాల వద్ద ఉన్న ఆడిట్ టన్నెళ్ల ద్వారా వరదనీరు సొరంగ మార్గం సహా పంపుహౌజ్‌లోకి చేరింది. మోటార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
రెండు రోజుల తర్వాత 4వ తేదీ నుంచి నీటిని తోడివేసే పనులను చేపట్టారు. వీలైనంత త్వరగా మోటార్లను బయటికి తీసేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఆరుగురు గజ ఈతగాళ్లను రప్పించి వారంరోజుల పాటు సర్జిపుల్ నుంచి పంపుహౌస్‌లోకి నీళ్లు వెళ్లకుండా షట్టర్లను మూసేపనులు చేపట్టారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు సుమారు 40మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. సుమారు 20 రోజుల తర్వాత మోటార్లు తేలాయి.