KTR LATEST TWEET : వైద్యం అందడం లేదు, పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహా ప్రభో అంటే బురద జల్లుతున్నారని మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. దవాఖానాల్లో మరణాలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించిన అంశాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. దానికి ప్రతి స్పందనగా కేటీఆర్ మళ్లీ ఎక్స్‌లో పలు అంశాలను లేవనెత్తారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే హైదరాబాద్‌లో నిర్మాణమవుతున్న టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసేవాళ్లమా అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే ఆలోచణా ధోరణితో పాటు పాలనా తీరు కూడా మారుతుందని పేర్కొన్నారు. మరణాల సంఖ్య చెప్పే ముందు ఒక బిడ్డ, ఒక తల్లి, వారి భవిష్యత్, ప్రేమ గురించి మాట్లాడుతున్నామన్న విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గుర్తుంచుకోవాలన్నారు.