Hydra Tender For Waste Disposal : హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను ఆక్రమించి అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా భవన నిర్మాణాల వ్యర్థాల తొలగింపుపై దృష్టి సారించింది. వాటిని పూర్తిగా తొలగించే బాధ్యతను కూడా తీసుకుని టెండర్ల దాఖలుకు పిలుపునిచ్చింది. కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు ఆఫ్లైన్లో టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు బిడ్స్ స్వీకరించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఈ మేరకు బుద్ధభవన్లోని ఏడో అంతస్తులోని హైడ్రా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఏడాది కాల పరిమితితో బిడ్స్ స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. బిడ్స్ దాఖలు చేసే కాంట్రాక్టర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లలో సమర్పించాలని రంగనాథ్ ఆదేశించారు. గడిచిన రెండు నెలల్లో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా 111 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.