Cyber Criminals Using DGP Ravi Gupta Photo : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేసి అమాయకుల జేబులను గుల్ల చేస్తున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్లు ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫొటోతో నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
వాట్సాప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆగంతకుడు ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. కేసు నుంచి తప్పించేందుకు రూ.50,000లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాకిస్థాన్ కోడ్ +92తో వాట్సప్ కాల్ వచ్చినట్లు నిర్ధారించారు.