PR Sreejesh Retirement: భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో పారిస్ ఒలింపిక్స్ పోటీలే ఆఖరివని పేర్కొన్నాడు. ఈ ఒలింపిక్స్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్న శ్రీజేశ్, ఈసారి పతకం రంగు మారుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
'పారిస్ ఒలింపిక్స్‌తో నా కెరీర్‌కు ముగింపు పలకనున్నా. విశ్వక్రీడల్లో మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీ, సహచరులు, కోచ్‌లు, భారత హాకీ జట్టు అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞుడినే. నాపై విశ్వాసం ఉంచిన మీ అందరికీ ధన్యవాదాలు' అని అన్నాడు.
కాగా, 36ఏళ్ల శ్రీజేశ్ 2010 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 328 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు.