CM Revanth Participate in Telangana Liberation Day : అక్షర యోధులు ఒక వైపు సాయుధ వీరులు మరోవైపు నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను మట్టికరిపించి, తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని, ఒక జాతి తన స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటుగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. సెప్టెంబరు 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.
సెప్టెంబరు 17, 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారని సీఎం రేవంత్ తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని, ఇందులో రాజకీయాలకు తావులేదన్నారు. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదన్నారు. అందుకే ప్రజా ప్రజాప్రభుత్వం ఈ శుభదినానికి ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవంగా జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.
"పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని గత పాలకులు భ్రమించారు. నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయం విస్మరించారు. తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది. డిసెంబరు 9న సచివాలయంలో తెలంగాణ విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరగనుంది. ఒకప్పుడు లేక్‌సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్లు పాలకుల పాపమే. హైదరాబాద్ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే హైడ్రాకు ప్రజలు సహకరించాలి." - రేవంత్ రెడ్డి, సీఎం
ఆరు నెలల్లో రైతు ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లు : మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని సీఎం రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఆరు నెలల్లో సుమారు రూ.18 వేల కోట్లను 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశామన్నారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ సమస్యను అధిగమించి ప్రతి ఒక్క అర్హుడిని రుణ విముక్తులను చేస్తామన్నారు.
నేను ఫాంహౌస్ సీఎం కాదు : కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని భేషజాలకు పోకుండా స్వయంగా దిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి తాను ఫాంహౌస్ ముఖ్యమంత్రిని కాదని, పని చేసే ముఖ్యమంత్రిని అని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణల వ్యూహాత్మక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్‌గా బ్రాండ్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. మూసీ సుందరీకరణ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదని, వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ పునరుజ్జీవనం కోసమే హైడ్రా : తెలంగాణ పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు లేక్‌సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్లు పాలకుల పాపమేనని సీఎం ధ్వజమెత్తారు. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు భారీ మూల్లం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కేరళ వంటి ప్రకృతి విలయ తాండవం హైదరాబాద్‌కు రావద్దన్నారు. హైడ్రా వెనుక రాజకీయ కోణం, స్వార్తం లేదన్నారు. అదొక పవిత్రమైన కార్యమని, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞంగా అభివర్ణించారు. భూమాఫియా పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే హైడ్రాకు ప్రజలు సహకరించాలని కోరారు.
సామాన్యుల్లోనూ 'హై'డ్రా గుబులు - నివాసాల కూల్చివేతలపై ఆందోళనలు - Hyderabad FTL And Buffer Zones