US Troop Withdrawal From Iraq : ఇరాక్‌లోని తమ సైనికబలగాల ఉపసంహరణకు అమెరికా సిద్ధమైంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా ఐసిస్ వ్యతిరేక సంకీర్ణ మిషన్ ముగుస్తుందని, తర్వాత యూఎస్ తొలి దశ సైనిక బలగాల ఉపసంహరణ ఉంటుందని ఇరాక్ వర్గాలు పేర్కొన్నాయి. ఐన్ అల్-అసద్ ఎయిర్‌బేస్, బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికన్ సైనికులు వెళ్లిపోతారని వారిని, కుర్దిస్థాన్ ప్రాంతంలోని ఎర్బిల్‌లోని హరీర్ స్థావరానికి తరలించనున్నట్లు తెలిపాయి.
ఇరాక్‌లో ఇస్లామిక్‌స్టేట్‌పై చాలా కాలంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 2,500 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాక్ ప్రభుత్వం చాలా కాలంగా దేశం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని అమెరికాను కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత, బలగాల ఉపసంహరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది.