Japan New Prime Minister : జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబా(67) ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. దీంతో అక్టోబరు 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషిద మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబరుతో ముగుస్తుంది. దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ పదవి కోసం ఇద్దరు మహిళలతో సహా 9 మంది పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో సుమారు 10లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇషిబా కెరీర్ ఆరంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో ఆయన రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు.