Israel Hamas War Update : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. వాటి మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. చర్చలు సానుకూల వాతావరణంలో సాగినట్లు మూడు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. వచ్చేవారం కైరోలో తదుపరి సమాలోచనలు చేయనున్నట్లు తెలిపాయి.
తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ ప్రస్తుతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని వెల్లడించాయి. హమాస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని చెబుతున్నాయి. ఈజిప్టుతో సరిహద్దు వెంబడి గాజా లోపల తమ బలగాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ షరతు విధించగా, హమాస్ వ్యతిరేకించింది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని పేర్కొంది. అటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందం కుదిరేందుకు చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.