Imran Khan Party Ban : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ)పై నిషేధానికి ఆ దేశ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం, అల్లర్లకు ప్రేరేపించిందనందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇమ్రాన్‌ఖాన్ 1996లో పీటీఐ పార్టీని స్థాపించారు. 2018లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల ఇమ్రాన్ ప్రభుత్వం ఏప్రిల్ 2022లో కూలిపోయింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. రిజర్వుడు సీట్ల కేసులో పీటీఐ పార్టీకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో ఇటీవల ఊరట దక్కిన నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.