Bangladesh Curfew : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరిన వేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. మూడు వారాలుగా ఆశాంతి నెలకొనడం వల్ల బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థులు అక్కడి నుంచి వెనక్కి వస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 300కిపైగా విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి అమరులైన స్వాతంత్ర్య సమర యోధుల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు గతంలో ఉన్న 30శాతం రిజర్వేషన్లను గత నెలలో ఆ దేశ హైకోర్టు పునరుద్ధరించింది. దీంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఢాకా, రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 70మందికిపైగా మృతి చెందారని జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.