Namita Temple Issue : మదుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో అగౌరవంగా మాట్లాడారని నటి నమిత ఆరోపించారు. తనని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని తెలిపారు. ఈమేరకు ఆమె వీడియో రిలీజ్ చేశారు. "కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించమన్నారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా" అని నమిత పేర్కొన్నారు.
నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారడం వల్ల ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించింది. "నమితతో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం. పై అధికారులు చెప్పడం వల్ల కొంత సమయం ఆగమని చెప్పాం. తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం" అని తెలిపారు.